సి.బి.ఐ డైరక్టర్ రంజీత్ సిన్హా వ్యవహారం సి.బి.ఐ ప్రతిష్టను దిగజార్చటంతోపాటు వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. 2జి కుంభకోణం, బొగ్గు గనులు, ఇనుప రజను గనులు, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం వంటి బడా కుంభకోణాలను దర్యాప్తు చేస్తున్న సి.బి.ఐ డైరక్టర్ ఈ కేసుల్లో నిందితులైన వారిని, నిందితుల ప్రతినిధులను తన ఇంట్లో పలు మార్లు కలుసుకోవటం మన సమాజంలో అవినీతి ఏ స్థాయికి చేరుకున్నదనేది సూచిస్తోంది. సి.బి.ఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో నిందితులైన వారిని, వారి ప్రతినిధులను ఇంట్లో కలుసుకున్నా వారికి ఎలాంటి సహాయం చేయలేదని రంజీత్ సిన్హా వాదించటం అధికార దురహంకారానికి పరాకాష్ట. కుంభకోణాల కేసుల్లో నిందితులైన వారిని ఐదారు సార్లు కసుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ పదిసార్లు, ఇరవై సార్లు, కొందరినైతే డెబ్బై, ఎనభై సార్లు కలుసుకోవటం వెనక ఉన్న పరమార్థం ఏమిటి అనే అనుమానం కలుగకమానదు. సి.బి.ఐ డైరక్టర్ పదవిలో ఉన్న సీనియర్ అధికారి కుంభకోణాల్లో నిందితులైన వారిని తన ఇంట్లో ఎందుకు కలుసుకోవాలి అనేది ప్రధాన ప్రశ్న. సి.బి.ఐకి చెందిన దర్యాప్తు అధికారుల పట్ల నిందితులకు ఉన్న ఫిర్యాదులను తెలుసుకోవలసిన బాధ్యతన తనపై ఉన్నదంటూ రంజీత సిన్హా వాదించటం సిగ్గు చేటు. సి.బి.ఐ దర్యాప్తు అధికారులపై ఫిర్యాదులు తీసుకునేందుకు ఆయన నిందితులు,వారి ప్రతినిధులను తన నివాసంలోనే ఎందుకు కలుసుకోవాలి? సి.బి.ఐ కార్యాలయంలో కలుసుకుని వారు చేసే పిర్యాదులను అక్కడి కక్కడే పరిష్కరించవచ్చు కదా? ఆయన అలా ఎందుకు చేయలేదు? కుంభకోణాల్లో నిందితులైన వారు తన నివాసానికి రావటంపై సిన్హా చేస్తున్న వాదన ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. సిన్హా మొండిగా వాదించటంతోపాటు తను ఇంట్లో కలిసిన వారి వివరాలను వెల్లడించిన వ్యక్తి పేరు బైటపెట్టాలంటూ గొడవ చేయటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? సిన్హా ను ఆయన ఇంట్లో కలిసిన వారి వివరాలు వెల్లడించిన వ్యక్తి పేరును తమకు సూచించాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడటం కూడా సమర్థనీయం కాదు. కుంభకోణాల వివరాలను వెల్లడించే వారి గుట్టు రట్టు చేయటం వలన సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుంది. గతంలో కుంభకోణాల సమాచారాన్ని వెల్లడించిన పలువురు హత్యలకు గురి అయ్యా రు. కాబట్టి సిన్హాను ఆయన ఇంట్లో కలిసిన నిందితులు, వారి ప్రతినిధుల జాబితాను ప్రశాం త్ భూషన్‌కు అందజేసిన వ్యక్తి పేరును ఎటువంటి పరిస్థితీలో కూడా బై పెట్టకూడదు. విజిల్ బ్లోయర్ వెల్లడించిన జాబితా నిజమైతే సిన్హా నువెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలి. అవినీతి పరుల ఆటకట్టించేందుకు ఏర్పా టు చేసిన సి.బి.ఐ డైరక్టర్ అవినీతి పరులతో చేరిపోవటం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. అక్రమాల వివరాలను రహశ్యంగా వెల్లడిస్తున్న విజిల్ బ్లోయర్ల పేర్లు వెల్లడించటం వలన సమాజానికి తీరని నష్టం వాటిల్లటంతోపాటు అవినీతిపరులు మరింత రెచ్చిపోతారు. కాబట్టి సుప్రీం కోర్టు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. విజిల్ బ్లోయ ర్లను రహశ్యంగా సన్మానించాలి తప్ప వారి పేరు, ఊరు బైట పెట్టటం ద్వారా అవినీతిని అరికట్టేందుకు కొందరు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాలకు గండి పడుతుంది. ప్రముఖ న్యాయవాది, ఆం ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు ప్రశాంత్ భూషన్ ద్వారా సిన్హా మీడింగ్‌ల డైరీని బైటపెట్టటం వెనక ఏదైనా కుట్ర ఉన్నదా? అనేది కూడా తేల్చుకోవలసిన అవసరం ఉన్నది. సి.బి.ఐ డైరక్టర్ రంజీత్ సిన్హా తన ఇంట్లో ఎవరెవరిని కలుస్తున్నారు? ఎంత సేపు కలుస్తున్నారు? ఎంత మందిని కలిసారు? ఒకే వ్యక్తిని ఎన్ని సార్లు కలిశారు? అనే వివరాలున్న డైరీ మామూలు డైరీ కాదనేది అందరికి తెలిసిందే. సి.బి.ఐ డైరక్టర్ నివాసంలో ఉండే డైరీని బైటికి తీసుకురావటం మామూలు విషయం కాదు. రంజీత్ సిన్హా అవినీతిని ఎండ గట్టాలనే గట్టి నిర్ణయంతోనైనా దీనిని బైటపెట్టి ఉండాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. సి.బి.ఐ డైరక్టర్ పదవిలో ఉన్న వ్యక్తి తన నివాసంలో నిందితులను పలుమార్లు కలుసుకోవటం గతంలో ఎప్పుడు జరగలేదు. డైరక్టర్ నేరుగా నిందితులు లేదా వారి ప్రతినిధులను కలుసుకోవటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొ త్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయించాలి. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవస్థకు లోబడి పని చేయాలి తప్ప వ్యవస్థను లోబరచుకోరాదు. సుప్రీం కోర్టు ఇటీవల బొగ్గు గనుల కుంభకోణం కేసు, 2జి కుంభకోణం కేసు విచారణ సమయంలో రెండు సార్లు కేంద్ర నేరపరిశోధనాసంస్థ పని తీరుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయటంతోపాటు సి.బి.ఐ డైరక్టర్‌పై ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అభిప్రాయపడింది. అవినీతి కేసులను విచారించే సి.బి.ఐ పని తీరు పారదర్శకంగా ఉండా లి. సి.బి.ఐ డైరక్టర్ ఎటువంటి పరిస్థితిలో కూడా తమ సంస్థ విచారణ జరుపుతున్న కేసులకు సంబంధించిన నిందితులు, వారి ప్రతినిధులను తమ నివాసంలో కలుసుకోకూడదు. సి.బి.ఐ కార్యాలయంలో వీరిని కలుసుకున్నా ఒక సీనియర్ అధికారి సమక్షంలో ఇది జరగాలి. కానీ రంజీత్ సిన్హా ఈ నియమాలన్నింటిని ఉల్లంఘించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర నేరపరిశోధనా సంస్థను ప్రక్షాళన చేయాలి. కేంద్ర ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యస్థ విధానం మూలంగా సి.బి.ఐలో బాధ్యతారాహిత్యం పెరిగిందని చెప్పకతప్పదు. సి.బి.ఐ డైరక్టర్ ఎంపిక ఒక పద్ధతి ప్రకారం జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా దీనికి స్వస్తిపలకాలి. సుప్రీం కోర్టు 1997లో వినీత్ నారాయణ్ కేసు, 2004లో దినకర్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు సి.వి.సి అధ్యక్షుడు, విజిలెన్స్ కమిషనర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ పర్సనల్ కార్యదర్శితో కూడిన కమిటీ సిఫారసు చేసే వారినే సి.బి.ఐ డైరక్టర్‌గా నియమించాలి. నియామకాలు ఒక పద్ధతి ప్రకారం జరిగినప్పుడే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: