మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం దీపావళి తరువాతనే ఏర్పాటు కానుంది. మహారాష్ట్రలో బలీయమైన ఒంటరి శక్తిగా అవతరించినప్పటికీ బిజెపి రాజకీయ సమీకరణల నేపథ్యంలో దీపావళికి అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. నూతన మంత్రివర్గంలో మం త్రులుగా ఎవరు ఉండాలి? ఎవరికి ఏ శాఖలు కట్టబెట్టాలి? అనే అంశంపై ఇప్పటికే బిజెపి నేతలు తలమునకలై ఉన్నారు. దీపావళికి ముందు మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశం లేదని, ఆ తరువాతనే ఏదైనా జరుగుతుందని బిజెపి వర్గాలు మంగళవారం తెలిపాయి. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ పండుగ తరువాతనే ముంబైకి వస్తున్నారు. ఆయన సమక్షంలోనే నూతన నాయకుడి ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. లెజిస్లేచర్‌పార్టీ నాయకుడి ఎంపిక ప్రక్రియకు సింగ్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జెపి నద్దాను పరిశీలకుడిగా ప్రకటిం చారు. వారు ఇప్పటికీ ముంబైకి చేరుకోలేదు. వారు వచ్చిన తరువాతనే నేత ఎంపిక ప్రక్రియ వేగవంతం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్థాపనకు అవసరమైన సంఖ్యాబలం పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ, అత్యధిక స్థానాలు దక్కించు కున్న పార్టీగా బిజెపి ప్రభుత్వ స్థాపనకు హక్కు చాటుకుంటుందని బిజెపి మహారాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తెలిపారు. 288 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వ స్థాపనకు 145 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. బిజెపికి సొంతంగా 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మద్దతుకు వచ్చిన ఎన్‌సిపితో కలిసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే మరోవైపు శివసేనతో పాత స్నేహం పునరుద్ధరణ దిశలో కూడా అడుగులు పడుతున్నాయని, ఇందుకు ఢిల్లీ స్థాయిలో దౌ త్యం జరుగుతోందని భావిస్తున్నారు. ఏది ఏమైనా సునాయాసంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామనే ధీమాతో బిజెపి వర్గాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ల మద్దతు గురించి కూడా పార్టీ వర్గాలు ఆలోచిస్తు న్నాయి. ఎన్‌సిపి తమకు బేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మరోవైపు శివసేన తమకు షరతులు విధించే పరిస్థితిలో లేదని, దీపావళి తరువాత ఇక తమదే అధికారం అని బిజెపి వర్గాలు సంబరాలలో పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: