ఎమ్ఎన్ఎస్... మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. శివసేన నుంచి విడిపోయి... కేవలం మరాఠీ (ప్రాంతీయతత్వం) నినాదంతో పుట్టుకొచ్చింది ఈ పార్టీ. నరనరానా జీర్ణించుకుపోయిన మరాఠీ భావజాలంతో, మహారాష్ట్రలో ఉన్న ఉత్తర భారతీయులపై అనేక సార్లు దాడులకు కూడా పాల్పడింది. ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర అధికార పీఠాన్ని అధిరోహిస్తామని ఆ పార్టీ చీఫ్ రాజ్ థాకరే అచంచల ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడే సరికి సీన్ అంతా రివర్స్ అయింది. కేవలం ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే ఎమ్ఎన్ఎస్ గెలుచుకోగలిగింది. ఎన్నికల ఫలితాలతో ఉన్న పరువంతా పోగా... ఇప్పుడు పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం... కొత్త పార్టీలకు నిర్దేశించిన రీతిలో ఓట్లు, సీట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలయినా గెలుపొందాలి. అంతేకాకుండా, ఆరు శాతం ఓట్లను గెలుచుకోగలగాలి. కానీ, ఎమ్ఎన్ఎస్ తరపున ఒక అభ్యర్థి మాత్రమే గెలుపొందాడు. ఇక లోక్ సభ విషయానికి వస్తే... ఆ పార్టీకి ఒక ఎంపీ కూడా లేరు. ఈ పరిస్థితుల్లో, ఎమ్ఎన్ఎస్ మెడ మీద ఈసీ కత్తి వేలాడుతోంది. ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపును రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న రాజ్ థాకరేకు... అనర్హత వేటు అంశం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే, దిక్కు తోచని స్థితిలో రాజ్ ఉన్నారు. 2009 ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలను ఎమ్ఎన్ఎస్ గెలుచుకోవడంతో... ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా దక్కింది. రైల్వే ఇంజిన్ గుర్తును ఈసీ కేటాయించింది. ప్రస్తుత పరిస్థితిలో, ఆ పార్టీకి గుర్తు కూడా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: