హుద్ హుద్ తుపాను కారణంగా కకావికలైన ఉత్తరాంధ్రను ఆదుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు.. మంచిదే.. ఆ ప్రకటనలు చూసి కొందరు మనసున్నవారు స్పందించినా చాలు.. బాధితులకు మెరుగైన సాయం అందుతుంది. ఐతే ఆ పత్రిక ప్రకటనలు రూపొందించిన తీరు విమర్శలకు గురవుతోంది. సాధారణంగా ఏదైనా సాయం కోరి ప్రకటన రూపొందించినప్పుడు... బాధితులు ఎలా ఇబ్బంది పడుతున్నారు.. వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరిస్తే..దాతల మనసు కరుగుతుంది. సాధారణ ప్రజలకు కూడా సాయం చేయాలన్న ఆలోచన రేకెత్తించేలా ఉండాల్సిన ప్రకటనలోనూ చంద్రబాబు.. తానెలా తుపాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు సాయం చేయండన్న ప్రకటనలోనూ చంద్రబాబు సొంత డబ్బా ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆ ప్రకటనలో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారన్న విమర్శలు వస్తున్నాయి. అబద్దాలతో ప్రకటన రూపొందించారంటున్న విపక్షాలు.. అందుకు ప్రకటనలోని కొన్ని వాక్యాలను ఉదహరిస్తున్నారు. ప్రకటనలో.. కేవలం మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. కనీసం ఐదారు రోజుల వరకూ ఉత్తరాంధ్రలో ఎక్కడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇక ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ తుపాను సృష్టించిన విలయం నుంచి తేరుకోలేదు. దీనికితోడు.. తాను తుపాను తీరందాటిన రోజే విశాఖకు హుటాహుటిన వెళ్లానని చంద్రబాబు ప్రకటనలో చెప్పుకొచ్చారు. అది పూర్తిగా అబద్దం... వాస్తవానికి ఆరోజు చంద్రబాబు విశాఖకు వెళ్లాలని ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. తుపాను తీరం దాటిన రోజు.. చంద్రబాబు రాజమండ్రి వరకూ వచ్చి ఆగిపోయారు. ఆ రాత్రి రాజమండ్రిలోనే బస చేశారు. మరుసటి రోజు.. మధ్యాహ్నానికి కానీ ఆయన విశాఖ చేరుకోలేకపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే... తుపాను బాధితులను ఆదుకొమ్మంటూ చేసిన ప్రకటనలోనూ ఇలా అబద్దాలు, సొంతడబ్బా ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి ప్రభుత్వవర్గాలు, టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: