పేరుకు కరవు జిల్లాయే అయినా కడుపులో అనంత ఖనిజాలను నింపుకున్న జిల్లా అనంతపురం జిల్లా.. ఈ జిల్లాయే కాదు.. రాయలసీమంతా.. రత్నాల ఖనిజాల నేల. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని ఇనుప ఖనిజం నిల్వలు లక్షల కోట్ల విలువ చేస్తాయి. అందుకే గతంలో గాలి జనార్దన్ రెడ్డి గనుల గజినీలు అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి కోట్లు గడించారు. ఓ కానిస్టేబుల్ కుమారుడైన ఆయన గనుల అక్రమాల కారణంగానే కోట్లు గడించారని విమర్శలున్నాయి. అదే ఆరోపణలపై ఆయన ఇప్పడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు కూడా. గాలి గనుల దోపిడీ, ఇతర అక్రమాలపై అప్పట్లో టీడీపీ చాలా పోరాటమే చేసింది. రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో ఓ పుస్తకమే వేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, గాలి జనార్ధన్ రెడ్డి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీల గురించి రోజూ దుమ్మెత్తిపోసేది. ఇప్పుడు సీన్ మారింది. వైఎస్ జగన్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నారు. జగన్ నానా తిప్పలు పడి బెయిల్ తెచ్చుకోగా.. గాలి ఇంకా కారాగారంలోనే బందీ అయ్యాడు. తాజాగా అనంతపురం జిల్లా గనులపై టీడీపీ కన్నుపడినట్టు తెలుస్తోంది. గనుల తవ్వకాల లైసెన్సులు పొందాలని వారు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు రాజకీయ నేతలు ప్రయత్నించడం సాధారణమే. కానీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకున్న పార్టీ నేతలు కూడా అదే బాటలో నడవాలని చూడటం విశేషమే. దీనిపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షడు రఘువీరా రెడ్డి స్పందించారు. ఇనుప ఖనిజం అనంతపురం ప్రజలహక్కని... ఈ గనులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: