"శకునం చెప్పే బల్లే కుడితిలో పడిందట.." అన్న సామెత ఎప్పుడైనా విన్నారా...? సరిగ్గా అలాగే జరిగింది ఇద్దరు మంత్రులకు. వారిలో ఒకరు కేంద్ర మంత్రయితే, ఇంకొకరు తెలంగాణలో కీలక మంత్రి. ఆరెస్సెస్, బీజేపీల్లో క్రియాశీలంగా ఉండే నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. కేంద్రంలో రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్న ఆయనే స్వయంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం విమర్శలకు దారి తీస్తోంది. గడ్కరీ నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ ఆఫీసుకు వెళ్లారట.. అదీ ఒక ద్విచక్రవాహనం పైన.. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ బండి నడిపిన ఆయన హెల్మెట్ పెట్టుకోకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్. స్వయానా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయి ఉండి కూడా ఆ శాఖ నిబంధలను ఆయనే పక్కనపెట్టడం వివాదాస్పదమైంది. నాగపూర్ లోని ఆరెస్సెస్ కార్యాలయంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలవడానికి ఆయన ఒక స్కూటర్ మీద వెళ్లారు. అయితే, వాహనం నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేశారట. అంతేకాదు, ఆ సంగతి సీసీ కెమెరాల్లోనూ రికార్డయిపోయింది. దీంతో ఇంకేముంది విమర్శించడానికి ఎవరు దొరుకుతారా అని చూసే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తన నోటికి పని చెప్పారు. గడ్కరీ నిర్లక్ష్య ప్రవర్తన బీజేపీ ప్రవర్తననే ప్రతిబింబిస్తోందని చురకంటించేశారు. ఇంకో విషయం ఏంటంటే గడ్కరీ మంత్రి కాక ముందు కూడా ఇలాగే హెల్మెట్ లేకుండా బండి నడిపి దొరికిపోయారని సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై వ్యవహారం నడిపేందుకు బండి నడుపుతూ వెళ్లిన గడ్కరీ ఇలా బోల్తా పడ్డారని మరాఠా రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మంత్రి సంగతి అలా ఉంచితే తెలంగాణలోనూ ఓ మంత్రి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలంగాణలో హోం, కార్మిక శాఖల మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి పాపం చాలా విచిత్రమైన స్థితిని ఎదుర్కొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ఒక కంపెనీలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. మూణ్నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో అనేక కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా పెద్దపేరు.. ఇప్పుడైతే ఏకంగా కార్మిక శాఖ మంత్రి పదవి. ఇంకేముంది నాయిని గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా. కానీ, అక్కడ మాత్రం కథ అడ్డం తిరిగింది. సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రయిన నాయిని ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: