దేశానికి స్వాతం త్రం వచ్చిన తరువాత మొదటిసారి ఒక ప్రధాన మంత్రి దేశ ప్రజలను గౌరవించి విశ్వసించవలసిన బాధ్యత పాలకులదని చెప్పటం ముదావహం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు బ్రిటీష్ వారి దారిలోనే ముందుకు సాగుతూ దేశ ప్రజలను తమ సేవకులుగా చూశారు తప్ప వారిని గౌరవించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. అధికారం మా జన్మ హక్కు అని విర్రవీగిపోయారు తప్ప ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే సేవకులమని వారెప్పుడు భావించలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ పాలకులు పాలితులను గౌరవించాలని నిర్దేశించటం ద్వారా చరిత్రను తిరగరాస్తున్నారు. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంలో బ్రిటీష్ కాలం నుండి పేరుకుపోయిన చట్టాల చెత్తను తొలగించి సంస్కరణల ద్వారా ఆధునికతను అందలం ఎక్కించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అత్యంత ఆధునిక ఆర్థిక సంస్కరణలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అలసత్వం, బాధ్యతారాహిత్యం, అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన ప్రభుత్వ సిబ్బంది మెడలు వంచి పని చేయించేందుకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రారంభించటంతోపాటు దీనికి కట్టుబడని వారిని ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చిన్నా, పెద్ద ఉద్యోగులెవరైనా సరే బయోమెట్రిక్ విధానం ప్రకారం అటెండెన్స్ వేసుకోవలసిందే. దేశంలో ప్రస్తుతం దాదాపు వెయ్యి చట్టాలు ఎందుకు పనిరానికి అమలులో ఉన్నాయి. వీటి మూలంగా ప్రభుత్వం పని తీరు బాగా కుంటుపడటంతోపాటు ప్రజలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటల్ బిహార్ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే ఎందుకూ పనికిరాని దాదాపు పద్నాలుగు వందల చట్టాలను రద్దు చేయాలని గుర్తించారు. అయితే అప్పట్లో కేవలం నాలుగు వందల చట్టాలను మాత్రమే తొలగించ గలిగారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కానీ యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వాధినేతలు కానీ ఈ పనికి రాని చట్టాలను తొలగించటం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనికి రాని చట్టాల నుండి ప్రజలు, ప్రభుత్వానికి విముక్తి కలిగించటంపై దృష్టి కేంద్రీకరించారు. పనికి మాలిన చట్టాలు దాదాపు ఒక వెయ్యి ఉండగా ఇందులో నుండి దాదాపు మూడు వందల యాభై చట్టాలను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రద్దు చేసేందుకు మోదీ రంగం సిద్ధం చేస్తున్నారు. 1861 పోలీసు చట్టం, 1920 పాస్‌పోర్టు చట్టం, 1939 విదేశీయుల రిజిష్ట్రేషన్ చట్టం, 1946 విదేశీయుల చట్టం, 1955 పౌరసత్వ చట్టంలాంటి పనికి మాలిన చట్టాలు ఎన్నో అమలులో ఉన్నాయి. 1967లో కొత్త సమగ్ర పాస్‌పోర్టు చట్టం ఏర్పడిన తరువాత కూ పాత పాస్‌పోర్టు చట్టం ఎందుకు అమలులో ఉన్నదనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న 1861 పోలీసు చట్టం ప్రకారం రాజవంశానికి చెందిన వారెవరైనా ఎదురు పడితే పోలీసు కానిస్టేబుల్ తన టోపిని తీసి ఒక చేతిలో పట్టుకుని సెల్యూట్ చేయవలసి ఉంటుంది. బ్రిటీష్ పాలకులు దేశం విడిచిపోయి 67 సంవత్సరాలు దాటుతున్నా ఈ పనికి మాలిన చట్టం అమలులో ఉండటం సిగ్గు చేటు. రాజ్యాంగంలోని 39వ ఆరికిల్ ప్రకారం ఆర్థక సంస్కరణలు దేశంలో అమలు కాకుండా చేయవచ్చు. అయితే మన పాలకులు ఈ ఆర్టికిల్‌ను సవరించకుండానే ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అటపట్టించాలనుకునే వారెవరైనా కోర్టుకు వెళ్లి రాజ్యాంగంలోని 39 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంస్కరణల అమలును సవాల్ చేయవచ్చు. కాలం చెల్లిన చట్టాల మూలంగా మేక్ ఇన్ ఇండియా లక్ష్యం దెబ్బ తింటోంది. నరేంద్ర మోదీ న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్‌లో ప్రసంగిస్తూ అవసరానికి మించిన పనికిమాలిన చట్టాలు, హద్దులు దాటుతున్న అవినీతి, అర్థం,పర్థం లేని నియమ,నిబంధనలు, హేతుబద్ధం కాని పన్నుల విధానం మూలంగా భారత దేశం వస్తూత్పత్తి రంగంలో ముందుకు సాగలేకపోతోంది. ఈ కారణం చేతనే మన దేశంలో ఉత్పత్తి చేసే బదులు పక్కన ఉన్న చైనా నుండి దిగుమతి చేసుకోవటం సులభం. ఈ ప్రతికూల పరిస్థితులు పోవాలంటే పనికి మాలిన, కాలం చెల్లిన చట్టాలు అగ్నికి ఆహుతి కావలసిందే. పాత చట్టాల చెదను తొలగిస్తున్న నరేంద్ర మోదీ తాజాగా కార్మిక చట్టాల సంస్కరణలు కార్మికుల దాస్య శృంఖలాలను తొలగిస్తాయి. సత్యమేవజయతే నుండి శ్రమేవ జయతే వరకు వచ్చిన నరేంద్ర మోదీని అభినందించవలసిందే. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న దాదాపు ఇరవైఐదు వేల కార్మిక చట్టాలు దాదాపు తొంబై శాతం మంది కార్మికులకు ఏ మాత్రం పనికిరావు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడే బదులు వారికి హాని కలిగిస్తున్నాయి. మోదీ ఈ లక్ష్యంతోనే కార్మిక చట్టాలను సంస్కరించేందుకు నడుం బిగించారు. కార్మికుల సమస్యలను కార్మికుల దృష్టి కోణం నుండి చూడాలి తప్ప పారిశ్రామికవేత్తల దృష్టితో చూడకూడదు. సర్ట్ఫికెట్లకు సెల్ఫ్ అటెస్టేషన్ అనుమతించటం చూస్తుంటే దేశానికి, దేశ ప్రజలకు నిజంగానే దేశానికి మంచి రోజులు వస్తున్నాయనే విశ్వాసం కలుగుతోంది. ఇంతవరకు ఏదైనా సర్ట్ఫికేట్‌ను అటెస్ట్ చేయించుకునేందుకు ఎన్ని కష్టాలు పడవలసి వచ్చేదనేది అందరికి తెలిసిందే. ప్రభుత్వం తమ ప్రజలను విశ్వసించకపోవటం అత్యంత నీచమైన విషయం. ప్రజలను గౌరవించటంతోపాటు వారి పట్ల ప్రభుత్వ విశ్వాసం పెంచేందుకు నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలు శ్లాఘనీయం. నరేంద్ర మోదీ ప్రతి రంగంపై తన ముద్ర వేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేశంలోని వేలు, లక్షలాది మంది విద్యార్థులతో ముఖా,ముఖి మాట్లాడి చరిత్ర సృష్టించారు. పరిశుభ్ర భారత్ నినాదంతో దేశంలోని నలుమూలల పేరుకుపోతున్న చెత్త తొలగింపును ఒక జాతీయ కార్యక్రమంగా చేయటంలో మోదీ విజయం సాధించారు. ప్రతివారం లేకపోతే నెలకొక సారి ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ద్వారా మోదీ అతి తక్కువ కాలంలో జాతీయ నాయకుడుగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: