తెలంగాణా తెలుగు దేశం పార్టీ పై అధికార టిఆర్ఎస్ దాడి కొనసాగిస్తోంది. తెలంగాణాలో తెలుగుదేశానికున్న దుర్భల స్థితిని సొమ్ముచేసుకోవాలన్నదే టిఆర్ఎస్ వ్యూహం. మరోవైపు ప్రజాసమస్యలపైన అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీసేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. అయితే ఎన్ని చేసినా తెలంగాణా తెలుగుదేశం తన మౌలిక బలహీనతను అధిగమించగలుగుతుందా? కొరవడిన స్ధానిక నాయకత్వం.. తెలుగుదేశం పార్టీ ఏక నాయకత్వ పార్టీ. కుటుంబ పార్టీ. చంద్రబాబు కుటుంబం మినహా మరో నాయకత్వాన్ని ఆపార్టీ ఊహించుకోలేదు. కానీ రాష్ట్రవిభజన నేపధ్యంలో తెలంగాణలో చంద్రబాబు కుటుంబం నాయకత్వాన్ని ఛలాయించలేదు. మరే నాయకుడూ చంద్రబాబు కుటుంబం లాగా తెలంగాణాలో పార్టీ శ్రేణులనూ ప్రజలనూ కదిలించలేరు. ఆహోదాను కానీ ఆ స్వేచ్ఛను కానీ పార్టీ అధిష్టానం ఏ తెలంగాణా నాయకునికీ ఇవ్వదు. ఎప్పటికైనా చంద్రబాబు నాయకత్వంలోనే తెలంగాణా టిడిపి అధినేత పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ నాయకుని కింద తెలంగాణా రాష్ట్ర నాయకుడు పనిచేయడాన్ని ఈ రోజున్న పరిస్థితుల్లో తెలంగాణా ప్రజలు అంగీకరించడం కష్టమవుతుంది. ఇదే తెలంగాణా తెలుగుదేశానికి వున్న ప్రధాన బలహీనత. భవిష్యత్తులో కూడా ఈ బలహీనతను అధిగమించడం తెలంగాణా తెలుగుదేశానికి కష్టమే. అలాంటి విశ్వాసం కూడా తెలంగాణా పార్టీ నాయకత్వంలో లేకపోవడం వల్లనే పార్టీలో ఇంతటి గందరగోళం. ప్రతిపక్ష కాంగ్రెస్ లో కూడా లేనన్ని ఫిరాయింపులు తెలుగుదేశంలో వుండటానికి కూడా ఇదే కారణం. సరిగ్గా ఈ బలహీనతను గురిచూసి తెలుగుదేశంపై టిఆర్ఎస్ బాణాలను సంధిస్తోంది. ఇది తెలుగు దేశానికే ప్రత్యేకం కాదు. ఉత్తరప్రదేశ్ విభజన అనంతరం ఉత్తరాంచల్ లో సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీలకూ పెద్ద బలం లేదు. జార్ఖండ్ లో ఆర్జేడి, జెడియులది కూడా అదే పరిస్థితి. వాటితో పోలిస్తే తెలంగాణాలో టిడిపి పార్టీదే కాస్తమెరుగేమో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల మధ్య వివాదాలు ఈ బలహీనతను మరింతగా పెంచుతున్నాయి. తెలంగాణా సెంటిమెంటును పండిస్తూ టిఆర్ఎస్ సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయినా తెలుగుదేశం ఈ సవాళ్ళకు నిలబడగలుగుతోందంటే ఆ పార్టీలో వున్న కొన్ని ప్రత్యేకతలే కారణం. తెలంగాణలో పట్వారి వ్యవస్థను రద్దుచేసి గ్రామసీమల్లో పార్టీ పట్టును పెంచుకుంది. బిసిలకు ప్రోత్సాహాన్నిచ్చి తన శ్రేణులను నిర్మించుకుంది. ఇప్పటికీ కార్యకర్తల బలం వున్న పార్టీగా నిలబడింది. పట్టణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయకత్వ పటిమపైన పాలనా దక్షత పైన కొన్ని వర్గాల్లోవున్న అభిమానం ఆపార్టీకి కలిసి వస్తోంది. తెలంగాణా రాష్ట్ర జనాభాలో మూడోవంతు వున్న హైదరాబాదు నగరంలో భిన్న ప్రాంతాల ప్రజలు నివసించడం ఆ పార్టీకి కలిసి వస్తున్న మరో అంశం. ఈ ప్రత్యేకతలు బలాన్నిస్తుంటే ఆ బలహీనతలు దెబ్బతీస్తుంటే తెలంగాణా రాజకీయ ఊయలలో టిడిపి అటూ ఇటూ ప్రయాణం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: