వీధికో బ్యాంక్... సందుకో శాఖ. దేశంలోని ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లినా... ఓ బ్యాంకు దర్శనమిచ్చే విధంగా ఆర్-బీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే చిన్న బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సేవలను విస్తృతం చేయాలన్న లక్ష్యంతో స్మాల్ బ్యాంక్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆవ్వానిస్తోంది రిజర్వ్ బ్యాంక్. ఆర్థిక అభివృద్దిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే లక్ష్యం వైపు మరో అడుగు ముందుకు పడింది. దేశీయంగా పొదుపు చేసే వారి సంఖ్యను పెంచడానికి... రైతులకు రుణాల మాంజూరీ పెంచడం కోసం... చిన్న వ్యాపారులకు ఆర్థిక సేవలు పెరగడంలో భాగంగా స్మాల్ బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్-బీఐ. ఈ బ్యాంకుల స్థాపనకు మూలధన పెట్టుబడి కింద 100 కోట్ల రూపాయిలు ఉండాలని నిబంధన విధించిన ఆర్-బీఐ... బ్యాంకును స్థాపించాలనుకునే వారు ప్రమోటర్ల వాటా కింద ముందుగా 40 కోట్ల రూపాయిలను సమకూర్చుకుంటే సరిపోతుందని అంటోంది. 12 ఏళ్లలోపు 40 శాతంగా ఉన్న ఈ వాటాను 26 శాతానికి తగ్గించుకోవచ్చంటూ వెసులు బాటు ఇస్తోంది. చిన్న బ్యాంకుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు లైసెన్స్ కోసం జనవరి 16లోపు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్న ఆర్-బీఐ... 15 నిమిషాల నడక దూరంలోనే ఓ బ్యాంకు దర్శనమిచ్చేలా నిర్ణయం తీసుకుంది. చిన్న బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకునే వ్యక్తులు... వారి వారి వ్యాపారాల్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాల్సి ఉండగా... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణులకు అయితే 10 ఏళ్ల అనుభవం అవసరం. ఇప్పటికే మనుగడలో ఉన్న నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్స్, లోకల్ ఏరియా బ్యాంకులు కూడా చిన్న బ్యాంకుల లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటున్న ఆర్-బీఐ... బ్యాంకింగ్ కార్యకలాపాల పరిధిని పెంచే ప్రయత్నం చేస్తోంది.  చిన్న బ్యాంకుల ప్రధాన లక్ష్యం సన్నకారు రైతులు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోని వీకర్ సెక్షన్స్ -కి రుణా మంజూరీ చేయాలన్నది ఆర్-బీఐ నిబంధన. ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా చిన్న బ్యాంకులు సేవలందించడానికి వీలుకల్పిస్తోంది రిజర్వ్ బ్యాంక్. లోన్ పోర్ట్-ఫోలియోలో కనీసం 50 శాతం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉండాలంటున్న ఆర్-బీఐ... ఈ మొత్తం 25 లక్షల రూపాయిల వరకూ ఉండాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. నికర సర్దుబాటు బ్యాంకు క్రెడిట్... ANBCలో 75 శాతం ఆర్-బీఐ నిర్థేశించిన ఎలిజిబుల్ సెక్టార్లకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా చిన్న వ్యాపారులు, రైతులకు రుణాల మంజూరీ మరింత అందుబాటులో ఉండే విధంగా చిన్న బ్యాంకుల మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్-బీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: