ఏపీ రాజధాని ఎలా ఉండబోతోంది.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే.. చంద్రబాబు మల్టీకలర్ మూవీ చూపిస్తున్నారు. ఇదిగో రాజధాని నమూనా అంటూ గాల్లోనే ట్రైలర్ చూపిస్తున్నారు. 20 వేల ఎకరాల్లో రాజధాని కేంద్రం, లక్ష ఎకరాల్లో రాజధాని ప్రాంతం.. 22 లక్షల ఎకరాల్లో మెట్రో రీజియన్ ప్రాంతం.. అంటూ ఎకరాల లెక్కలు చెబుతున్నారు. తాజ్ మహల్లాంటి అసెంబ్లీ.. బృందావన్ గార్డెన్స్ ను తలదన్నే ఉద్యానవనం, 44 అంతస్తుల్లో సచివాలయం.. ఇలా అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు. మంచిదే.. అలాంటి రాజధాని కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.                                       చంద్రబాబు మాటలు వినసొంపుగానే ఉన్నా.. రాజధాని విషయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయంటున్నారు సీనియర్ రాజకీయ నాయకులు.. ఏదో విపక్షాలంటే.. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాయనుకోవచ్చు.. కానీ చంద్రబాబును నిలదీస్తున్నది ఆయన పార్టీకే చెందిన నాయకుడు. అందునా ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు కూడా. ఆయనే వడ్డీ శోభనాద్రీశ్వరరావు. ఆయన అడుగుతున్న ప్రశ్నల్లో మొదటిది.. అసలు రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు ఎందుకు..? మలేసియా రాజధాని జయపుత్రతో పాటు ఎన్నో కొత్త రాజధానులు 10 నుంచి 15 వేల ఎకరాల్లో కట్టారు కదా.. మరి లక్ష ఎకరాలు ఎందుకు.. అని వడ్డే ప్రశ్నిస్తున్నారు.                      రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా కడతామంటున్నారు.. సరే.. దానికి నిధులెక్కడి నుంచి వస్తాయి..? రాష్ట్ర బడ్జెట్ లోటుతో మొదలైంది. కేంద్ర సాయం అందుతుందనుకుంటే... ఇప్పటివరకూ మహా అయితే ఓ వెయ్యి కోట్ల కంటే ఏ రాజధానికీ కేంద్రం ఇవ్వలేదు.. మరి మిగిలిన లక్ష కోట్ల రూపాయల నిధులు ఎక్కడ నుంచి తెచ్చి బ్రహ్మాండమైన రాజధాని కడతారు.? భూములు మర్యాదగా ఇస్తే ఓకే.. లేకుంటే ఎలాగూ లాక్కుంటాం అనే బెదిరింపు ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు..? రాజధాని నిర్మాణానికి భూములు సేకరిస్తున్న తుళ్లూరు మండలం కొండవీటి వాగు వరదలకు మునిగిపోయే అవకాశం ఉంది.. ఆ భూమిని ఎలా ఎంపిక చేశారు..? మరి ఈ ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో దగ్గర సమాధానం ఉందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: