ఆంధ్రా అసెంబ్లీలో పై చేయి కోసం అధికార, విపక్షాల వ్యూహాలు రచిస్తున్నాయి. హుద్ హుద్ చర్చ సందర్భంగా సర్కారు పనితీరును ప్రతిపక్షం ఎండగడుతుంటే.. తాము చేసినట్టుగా గతంలో ఎవరూ చేయలేదని అధికార పక్షం చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. హుద్ హుద్ చర్చలోనూ.. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోనూ.. అధికార పక్షం.. సమాధానం ఇవ్వడం కంటే.. ఎదురుదాడిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఎస్సీ, ఎస్టీలకు నిధుల విషయంలోనూ, ఫించన్ల విషయంలోనూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా.. పలువురు మంత్రులు వైఎస్ సర్కారు అలా చేసిందంటూ విమర్శలకు దిగారు.                                  వైఎస్ హయాంలో దొంగలకు, ఖూనీకోర్లకు, స్మగ్లర్లకు రుణాలిచ్చారని మంత్రి రావెల కిషోర్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఎస్సీఎస్టీ నిధులను హైదరాబాద్ అభివృద్ధి కోసం దారి మళ్లించారని గుర్తు చేశారు. ఇక ఫించన్లలో అక్రమాల సంగతి ప్రస్తావించినప్పుడు.. మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలకే అన్నీ దోచిపెట్టారని మండిపడ్డారు. ఇలా ఏ ప్రశ్న అడిగినా ఎదురుదాడి చేయడం.. వైఎస్ పాలన ప్రస్తావన తీసుకురావడం కామన్ అయ్యింది.                         వై.ఎస్. పాలనపై మంత్రులు పదే పదే విమర్శలు చేయడంపై ప్రతిపక్షనేత జగన్ మండిపడ్డారు. ఈ సభలో దేని గురించి చర్చ జరుగుతోంది.. హుద్ హుద్ తుపాను గురించా.. వైఎస్ పరిపాలన గురించా అని ఆయన ప్రశ్నించారు. తామేం అడిగినా.. పరనింద, ఆత్మస్తుతి స్టార్ట్.. అంటూ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సభలో చంద్రబాబు లేనందువల్ల.. ఆయన ముందు ఇవాళ బిల్డప్ ఇద్దామని సభ్యులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: