అధికారానికి దూరమైన పార్టీని కాపాడుకుంటూ రావడం ఎంత కష్టమో ఇప్పుడు జగన్ కు అనుభవంలోకి వస్తోంది. ఇప్పటికే కొణతాల, దాడి వంటి సీనియర్లు.. చివరకు జూపూడి వంటి వారూ దూరమయ్యారు. ఇక తెలంగాణలో ఆ పార్టీలో మిగిలినవారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ సమయంలో ఇప్పడు మరో పెద్ద తలకాయ మైసూరారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కు కష్టకాలంలో అండగా ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయన వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలై కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలబడ్డ వారిలో మైసూరా రెడ్డి ఒకరు.                                           మైసూరా వైఎస్ రాజశేఖర రెడ్డికి తొలినాళ్లనుంచీ స్నేహితుడు. ఆ తర్వాత మధ్యలో తీవ్ర విభేధాలతో పసుపు జండా పట్టుకున్నారు. మళ్లీ వైఎస్ మరణం తర్వాత.. జగన్ సొంత పార్టీ పెట్టిన సమయంలో యువనేత చెంతకు చేరారు. వైసీపీకి కష్టకాలంలో తన సీనియారిటీతో దిశానిర్దేశం చేశారు. అపార రాజకీయ అనుభవం, చతురత ఉన్న మైసూరా సేవలు ఆ పార్టీకి బాగానే ఉపయోగపడ్డాయి. మొదట్లో మైసూరారెడ్డి సలహాతోనే జగన్ కీలక నిర్ణయాలన్నీ తీసుకునేవారు. అందుకే... జగన్ జైలు పాలయినా.. పార్టీకి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఇటీవలి కాలంలో మైసూరాకు పార్టీలో జగన్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు.                              సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీలో మైసూరా పొజిషన్ మారిపోయింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మైసూరా ప్రాధాన్యత క్రమంగా తగ్గిస్తున్నారని ఆయన అనుచరగణం అసంతృప్తితో ఉంది. జగన్ అనుచరుడు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత పెంచుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ తరపున రాజ్యసభకు వచ్చే స్ధానాన్ని విజయసాయికే ఇస్తారన్న వార్తలు మైసూరాకు మరికాస్త కష్టం కలిగించాయి. జిల్లాల సమీక్షలకోసం ఇటీవల త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేసిన జగన్.. మైసూరా రెడ్డి ని అందులో నియమించలేదు. కష్టకాలంలో అండగా ఉన్న తనను జగన్ పట్టించుకోక పోవడంతో మైసూరా కూడా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: