తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను సారధిగా చేసుకొని రాజకీయాలు చేద్దామని అనుకొంది. అయితే ఆ పెద్ద చేప భారతీయజనతా పార్టీ గాలానికి పడటం లేదు. కానీ ఇదే అదునుగా చాలా చిన్న చేపలు వచ్చి బీజేపీ వలలో పడుతున్నాయి. ప్రయత్నాలు చేయకుండానే పడుతున్న ఈ చేపల వల్ల బీజేపీకి ఎంత వరకూ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదిప్పుడు. గంగై అమరన్, నెపోలియన్.. వంటి వాళ్లు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. ఇదే సమయంలో విజయ్ కాంత్ వంటి వాళ్లు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారు. గంగై అమరన్ కు ఇళయరాజా తమ్ముడిగా గుర్తింపు ఉంది. ఈయనకు రాజకీయాలు చేసేంత , జనాలను ఆకర్షించగలిగేంత శక్తి ఉందనుకోలేం. ఇక నెపోలియన్.. ఇన్ని రోజులూ డీఎంకే పార్టీలో ఎంపీ హోదాలో... యూపీఏలో కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉండేవాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా రాణించిన నటుడు నెపోలియన్. అయితే నెపోలియన్ రాజకీయ ఎదుగుదలకు అళగిరి కారణం. డీఎంకేలో అళగిరికి సన్నిహితుడిగా పేరు పొందాడు నెపోలియన్. ప్రస్తుతానికి అళగిరి డీఎంకే కు దూరం అయ్యాడు. దీంతో నెపోలియన్ ప్రాధాన్యత తగ్గింది. ఇదే అదునుగా ఈ మాజీ ఎంపీ బీజేపీ వైపుకు జంప్ చేశాడు. ఈ రకంగా చూసుకొంటే అందరూ ద్వితీయ స్థాయి నేతలే భారతీయ జనతా పార్టీ వైపు వెళుతున్నారు. మరి ఇలాంటి వారితో బీజేపీకి ఎంత లాభం కలుగుతుందో.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కానీ అర్థం కాదు!

మరింత సమాచారం తెలుసుకోండి: