ప్రత్యేక హోదా.. ఈ హోదా కోసం దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఈ హోదా ప్రకటిస్తే.. అనేక విషయాల్లో పన్ను రాయితీలు ఉంటాయి. కేంద్రం నిధులు, గ్రాంట్లు అందుతాయి. పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు లభిస్తాయి. ఈ హోదా ప్రకటిస్తే.. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అందుకే ఏపీ విభజన సమయంలో సీమాంధ్రనేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆమేరకు పార్లమెంటులోనూ హామీ లభించింది.              ఐతే... ఆరునెలలైనా ఆ హోదా ఇంతవరకూ దక్కలేదు. అంతేకాదు.. ఎవరికైనా ఇంకా ఏపీకి ఆ హోదా వస్తుందని ఆశ ఉంటే.. దాన్ని వదిలేసుకోవచ్చని తాజాగా సాక్షాత్తూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే తేల్చి చెప్పేశారు. చావుకబురు చల్లగా చెప్పాలన్నట్టు.. వెంకయ్య కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయాన్ని చాలా తెలివిగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించడం చాలా కష్టమని ఆయన స్వయంగా వెల్లడించారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం.. అన్న చందంగా కాంగ్రెస్ పోతూపోతూ బాధ్యత లేకుండా హామీ ఇచ్చిపోయిందని వ్యంగ్యోక్తులు విసిరారు వెంకయ్య.                ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వెంకయ్య చెప్పిన ప్రొసీజరు చూస్తే.. అది అసాధ్యమని బుర్రలో గుజ్జున్న ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే.. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను ఒప్పించాలట. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే.. జాతీయ అభివృద్ధి మండలి అంగీకారం కావాలట. ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాలు ఏపీకి హోదా ఇవ్వడాన్ని నిరసిస్తున్నవేళ.. అన్ని రాష్ట్రాల ఆమోదం పొందటం దాదాపు అసాధ్యం.. ధైర్యం చేసి పార్లమెంటులో బిల్లు పెడదామన్నా.. రాజ్యసభలో అది పాసవ్వడం కష్టమే.. అందుకే.. అందర్నీ ఒప్పించి.. మెప్పించి.. ఏపీకి హోదా తెస్తామంటున్నారు. అంటే.. ఇక దాని గురించి మర్చిపోండ్రా బాబూ.. అని చెప్పకనే చెప్పేశారు వెంకయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: