విజయవాడలో రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ఎవరికీ ఎలాంటి వ్యతిరేకత లేకున్నా ఇందుకోసం ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించటం వల్ల గ్రామీణప్రాంత వనరులన్నీ రాజకీయ, దేశ విదేశీ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఓ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు మహా నగర నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. గతంలో జనాభా నియంత్రణలో తాను ముందంజలో ఉన్నానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు కోటి మంది అవసరాలను దృష్టిలో ఉంచుకుంటున్నానంటూ చెప్పటం చూస్తే స్థానికంగా ప్రతిఒక్కరూ పిల్లల్ని పుట్టించాలా, లేక వలసవాదులను ప్రోత్సహిస్తారా? అని ఆయన వ్యంగంగా ప్రశ్నించారు. సింగపూర్ తరహాలో 40 అంతస్తుల భవన నిర్మాణాలు చేపడితే ప్రస్తుత హైదరాబాద్ సచివాలయ స్థలంలోనే రెండు, మూడు రాష్ట్రాల రాజధానులను నిర్మించవచ్చని అన్నారు. స్థానిక పరిస్థితులు, అవసరాలు, ప్రధానంగా మరుగుదొడ్లలో నీరా, లేదా కాగితాలు వాడతారో కూడా తెలియని సింగపూర్, జపాన్ దేశీయులు మనకు దిశ, దశా నిర్దేశం చేస్తారా అంటూ మండిపడ్డారు.  ముందుగా మన శాస్త్ర, సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు. మాకినేని బసవపున్నయ్య శత జయంతి సందర్భంగా ‘రాజధాని నిర్మాణం పాలన కోసమా? ప్రతిష్ఠ కోసమా?’ అనే అంశంపై ఆదివారం నాడిక్కడ జరిగిన సదస్సులో రాఘవులు కీలకోపన్యాసం చేశారు. తుళ్లూరు పరిసరాల్లో ఇప్పటికే వందల కోట్లలో 3వేల ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు జరిగినా తొలుత రైతుకు ఒరిగిందేమీ లేదని ఆయనన్నారు. పైగా 30వేల ఎకరాల వెలుపల భూములన్నీ బడా బాబుల కబంధ హస్తాల్లోకి వెళ్లాయన్నారు. ఎకరానికి వెయ్యి గజాల స్థలం వస్తుందని తెలిసినా కోట్లు ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసే వారు భవిష్యత్‌లో అక్కడ బడా మాల్స్ నిర్మించుకుంటారు కాని కిరాణా షాపులు, బడ్డీకొట్లు పెడతారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో బలం ఉంది కదా అని సిఆర్‌డిఎ చట్టాన్ని ఆమోదించుకున్నారని, కనీసం విధివిధానాల అమలులో అయినా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రాఘవులు డిమాండ్ చేశారు. వౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుతం స్థానికుల నుంచి అభివృద్ధి ఫీజులు వసూలు చేస్తే ఇవి ఉపయోగపడేది సామాన్యులకు కాదని, ఆప్రాంతంలో తిరిగే బడా బాబులకేనని విమర్శించారు. సదస్సులో జెఎన్‌టియు ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు, తదితరులు ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: