ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మరోసారి దీక్షకు దిగారు. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఆ మధ్య రుణమాఫీ అంశంపై విశాఖలో దీక్ష చేసిన జగన్.. ఈసారి పశ్చిమగోదావరి జిల్లాను టార్గెట్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగా జగన్ ఈ దీక్ష చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలన్నది జగన్ దీక్షలో ప్రధాన డిమాండ్. ఐతే రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. మరి జగన్ ఎందుకు తణుకులోనే దీక్షకు దిగుతున్నారనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ తణుకును ఎంచుకోవడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలూ, మూడు లోక్‌సభ స్థానాలన్నింటా తెలుగుదేశం, దాంతో జత కట్టిన బిజెపిలే గెలిచాయి. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పూర్తిగా సత్తా చాటింది. మున్సిపాల్టీలన్నీ తెలుగుదేశం ఖాతాలోకే వెళ్లాయి. మండల పరిషత్‌లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువగాను, జిల్లా పరిషత్‌ తెలుగుదేశానికే దక్కాయి.

అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకే జగన్ తన తాజా దీక్ష కోసం పశ్చిమగోదావరి జిల్లాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాలు ఎటు మొగ్గితే.. రాష్ట్రం అటు మొగ్గుతుందని ఓ రాజకీయ సామెత ఉంది. అందుకే ముందుగా గోదావరి జిల్లాలపై జగన్ కన్నేసినట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: