టెక్నాలజీని వాడుకోవడంలో అంతా చంద్రబాబు తర్వాతే అంటారు. అమరావతి విషయంలోనూ అదే జరుగుతోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విపరీతమైన ప్రచారం కల్పించడంలో చంద్రబాబు ఇప్పటికే గ్రాండ్ సక్సస్ అయ్యారు. ఇప్పుడు ఏపీలో ఏ టీవీ ఛానల్ పెట్టినా.. ఏ పత్రిక తిరగేసినా అమరావతి వార్తలే తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. 

అలాగే సోషల్ మీడియాలోనూ ఇప్పుడు అమరావతి మేనియా నడుస్తోంది. అమరావతి కోసం విరాళాలు సేకరించడంలోనూ చంద్రబాబు హైటెక్ పద్దతినే అవలంభించారు. మై బ్రిక్- మై అమరావతి అంటూ చేసిన ప్రయత్నానికి లక్షల విరాళాలు వస్తున్నాయి. ఇక్కడివరకూ బాగానే ఉంది. ఐతే.. అమరావతికి మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం బాబు ఫ్యామిలీ చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టినట్టుంది. 

చంద్రబాబు మన అమరావతి- మన రాజధాని అంటూ చేస్తున్న సెల్ఫీల ప్రచారంపై వెరైటీ కామెంట్లు వస్తున్నాయి. చంద్రబాబు ఉద్దేశం మంచిదే అయినా.. అందుకు ఆయన ఇచ్చి సెల్ఫీ ఫోటో చూసి టీడీపీ నేతలే అవాక్కవుతున్నారు. ఓ పలకపై మన అమరావతి-మన రాజధాని అని ఇంగ్లీషులో రాసుకుని ఫోటో దిగారు. లోకేశ్ కూడా అదే పని చేశారు. 

కానీ.. ఆ ఫోటోలు చూడగానే పోలీస్ స్టేషన్లో పాత నేరస్తులు తమ పేరు ఊరు రాసి ఉంచే పలకలే గుర్తొస్తున్నాయి. ఇదేంట్రా మన నాయకుడు పోలీస్ స్టేషన్ కు ఎందుకెళ్లాడు.. ఎప్పుడెళ్లాడు.. అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.  కాకపోతే.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కాగితం చూపిండంతో కొంతవరకూ ఓకే. ఇక కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాంశ్ మాత్రం హైటెక్ అనిపించారు. వారు ట్యాబులను ప్రదర్శిండం బావుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: