భారతీయజనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉండే పార్టీ అని సాధారణంగా అంతా అనుకుంటూ ఉంటారు. వారు కూడా అధికారంలో లేని సమయంలో అయితే.. తమ గురించి తాము అలాగే చెప్పుకుంటూ ఉండేవారు. కానీ వ్యక్తుల అసలు బుద్ధులు బయటపడేది.. వారి చేతిలో అధికారం ఉన్నప్పుడే కదా? ఆ లెక్కన భాజపాలో అసలు సిసలు క్రమశిక్షణ ఉన్నది ఎంతమాత్రమో ఇప్పుడు తెలుస్తున్నది. బీహార్‌ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాభవాన్ని చవిచూసిన నేపథ్యంలో అందుకు బాధ్యుడిగా మోడీని నిందించాలా వద్దా అనే విషయంలో పార్టీ నాయకులు దాదాపుగా వీధిన పడి కొట్టుకుంటున్నట్లుగా వ్యవహారం ఉన్నది. కాకపోతే.. అందరూ వయసుడిగిపోయిన నాయకులే గనుక.. మరీ పైపైనే కాట్లాడుకుంటున్నారు. 


చివరికి భాజపాలోని ముఠా తగాదాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయంటూ వామపక్షాలు కూడా విమర్శించే స్థాయికి బీజేపీ రాజకీయాలు బజార్న పడ్డట్లుగా కనిపిస్తోంది. భాజపా అంతర్గత రాజకీయాలు ఇప్పుడు బాగా తెలుస్తున్నాయంటూ.. సీపీఎంకు చెందిన సీనియర్‌ నాయకుడు సీతారాం యేచూరి వ్యాఖ్యానించడం విశేషం. 


నిజానికి భారతీయ జనతా పార్టీలో ఈ ముఠాల కల్చర్‌, ఒకరినొకరు తూలనాడుకోవడం.. వీటన్నిటికీ మోడీ శ్రీకారం చుట్టాడనే వాదన కూడా వినిపిస్తోంది. తనకి రాజకీయ గురువుగా చెప్పుకుంటూ.. బహిరంగ వేదికల మీద అద్వానీ కాళ్లు మొక్కి అతి భక్తిని ప్రదర్శించే మోడీన తైనాతీలు అయిన ప్రస్తుత పార్టీ నాయకులు.. బీహార్‌లో ఓటమి గురించి సీనియర్లు వ్యక్తంచేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారి మీద యాక్షన్‌ తీసుకునే ఆలోచన వరకు వెళ్లడం పార్టీ పరువును దిగజార్చే విధంగానే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: