మీరు చదివింది నిజమే.. హీరోయిన్ సమంతపైనే వెంకయ్య సెటైర్లేశారు.. ఆ వెంకయ్య కూడా కేంద్రమంత్రి వెంకయ్య నాయడే.. ఇంకెవరో కాదు. మరి ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడే వెంకయ్య, కేంద్రం అభివృద్ధిని డాల్బీ స్టీరియో సౌండ్ తో వినిపించే వెంకయ్య, మోడీ చేసిన అభివృద్ధిని అనర్ఘళ వాగ్దాటితో వివరించే వెంకయ్య.. హీరోయిన్ సమంతాపై సెటేర్లు ఎందుకు వేశారా అనుకుంటున్నారు.. అది కూడా మోడీ భజనలో ఒక భాగమే. 

అసలు విషయం ఏంటంటే.. వెంకయ్య నాయుడు గుంటూరు జిల్లా లాం లో వ్యవసాయ యూనివర్శిటీ శంకుస్థాపనకు వచ్చారు. యథాప్రకారంగా కేంద్రం అభివృద్ధి పథకాలు వివరిస్తున్నారు. మోడీ గొప్పదనాన్ని పొగుడుతున్నారు. దానికి ఉదాహరణగా ప్రధాని మోడీ లండన్ పర్యటనను ప్రస్తావించారు. మోడీ భారతీయుల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పుకొచ్చారు. 

మోడీ లండన్ లో అడుగుపెట్టిన ప్రభావంతో లండన్ ప్రధాని కేమరూన్ భార్య  భారతీయ సంప్రదాయ వస్త్రమైన చీర కట్టిందట. ఆంగ్లేయులు చీరలు కట్టరు అయినా మోడీ ప్రభావంతో ఆమె చీరకట్టిందని వెంకయ్య చెప్పుకొచ్చారు. లండన్- మోడీ-కేమరూన్ భార్య - చీర.. అంతా బాగానే ఉంది. మరి హీరోయిన్ సమంతా విషయం అక్కడ ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటారా.. అక్కడే ఉంది తమాషా.

లండన్ ప్రధాని కేమరూన్ భార్య పేరు కూడా సమంతాయే. అందుకే మోడీ ప్రభావంతో సమంతా చీరకట్టిందని వెంకయ్య చెబుతూ.. మన హీరోయిన్ సమంతాపైనా చమక్కులు విసిరారు. మన దగ్గర కూడా ఒక సమంతా ఉంది. ఆమె కూడా అప్పుడప్పుడు చీర కడుతుంది. మన సమంతా చీర కట్టడం సాధారణమే. కానీ కేమరూన్ భార్య చీర కట్టడమంటే మాటలు కాదు.. ఆ స్థాయిలో మోడీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు.. అంటూ మోడీ భజన కొనసాగించారు మన వెంకయ్య. అమ్మె ఈ వెంకయ్య సామాన్యుడు కాడండోయ్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: