వరంగల్‌ ఉప ఎన్నికను తాము సీరియస్‌గా తీసుకుని గట్టిగా పరిశ్రమిస్తూ ఉంటే అసలు కేండిడేట్‌ను నిలబెట్టిన భాజపా మాత్రం.. లైట్‌ తీసుకున్నదంటూ తెతెదేపా ఆవేదన చెందుతున్నదని వార్తలు వస్తున్నాయి. తమ సొంత పార్టీకి ఉన్న బలాన్ని బేరీజు వేసుకోవడానికి, మరింత బలం సంపాదించుకోవడానికి వరంగల్‌ ఉప ఎన్నికను ఒక అవకాశంగా వాడుకోవాలని తెలుగుదేశం తొలినుంచి ఆశగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి ఆశల మీద మిత్రపక్షమే నీళ్లు చిలకరిస్తున్న వాతావరణం కనిపిస్తన్నదని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 


వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీకి తొలినుంచి ఆశ జాస్తిగానే ఉంది. అసలు ఆ స్థానాన్ని భాజపాకు కేటాయించకుండా ఉండడానికి వారు ఆదినుంచి ఎంత ప్రయత్నం చేశారో కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు వద్ద వారు చాలా గట్టిగానే పట్టుపట్టారు. ఒకరకంగా చెప్పాలంటే మొండికేశారు, ఆయనను ధిక్కరించారు. ఇన్ని జరిగినా తెతెదేపా ఆ సీటును మిత్ర ధర్మం పేరిట భాజపాకు వదులుకోవాల్సి వచ్చింది. 


సీటు దక్కించుకోవడం వరకు శ్రద్ధగా ఉన్న భాజపా ఆ తర్వాత ఈ ఎన్నిక గురించి పట్టించుకోవడం లేదంటూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. డబ్బున్న అభ్యర్థిని తెచ్చి పెట్టేసి, అంతటితో భాజపా నాయకులు చేతులు దులుపుకున్నారని.. ఇక ఎన్నికల్లో విజయం సాధించడం గురించి పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలం నిరూపించుకుంటే ముందు ముందు సార్వత్రిక ఎన్నికలకు కూడా తమ పార్టీకి లాభం ఉంటుందనేది తెదేపా ఆలోచన. అయితే బీజేపీ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదంటున్నారు. చివరికి కాంగ్రెస్‌ కూడా దిగ్విజయసింగ్‌, మీరాకుమార్‌ వంటి నాయకుల్ని తీసుకువచ్చి ప్రచారం చేయిస్తూ ఉంటే.. భాజపా జనంలో గుర్తింపు ఉన్న కేంద్ర నాయకులు ఒక్కరిని కూడా ప్రచారానికి తేలేకపోవడం చాలా శోచనీయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాము ఎన్నిక కోసం ఎంత కష్టపడుతున్నా.. ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: