మీరు నన్ను విశ్వసిస్తున్నట్లయితే నన్నొకసారి కౌగలించుకోండి. నన్ను టెర్రరిస్టు అంటున్నారు... నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మిమ్మల్ని నేను నమ్ముతున్నా. మీరు నన్ను నమ్ముతారా? నమ్మినట్లయితే నన్ను కౌగలించుకోండి. ముఖానికి టవల్ కప్పుకుని బోర్డులు పట్టుకున్న ఆ వ్యక్తి తల వంచుకుని స్థాణువులా నిలబడి ఉన్నాడు. అది పారిస్ లోని ప్లేస్ డె లా రిపబ్లిక్ అనే ప్రాంతం. ఐఎస్ ఉగ్రవాదుల దాడికి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి పలికేందుకోసం అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. పారిస్ నడిగడ్డలో నిలిచి కళ్లకు టవల్ చుట్టుకున్న ఒక ముస్లిం రెండు ప్లకార్డుల మీద ఆ వాక్యాలు రాసి కాళ్లకు అటూ ఇటూ వాటిని ఉంచి వాటికేసి చూస్తూ అక్కడున్నవారినందరినీ అడుగుతున్నాడు. 


పారిస్ ప్రజలు ఆ వ్యక్తిని ఏమాత్రం అవమానించలేదు. అనుమానించలేదు. తలవంచుకుని ఉన్న ఆ వ్యక్తి గౌరవానికి వారు భంగం కలిగించదల్చుకోలేదు. చుట్టూ ఉన్న వారందరి కళ్లలో ధారలుగా నీళ్లు. మానవత్వపు చిత్తడిలోంచి ఊరుతున్న కన్నీరు. అతడి చుట్టూ ఉన్న వందలాదిమంది కరిగిపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా జనం అతడి వద్దకు వచ్చారు. ఈ క్షణంలో మేం నిన్ను నమ్మకపోతే, మమ్మల్ని మేం కూడా మేం నమ్మలేం అనేంత భావోద్వేగంతో అతడిని గట్టిగా కౌగలించుకున్నారు. చిన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఆ వ్యక్తిని తమలో ఒకడిగా కలుపుకున్నారు.  కన్నీళ్లతో విలపిస్తూ ఒకరి తర్వాత ఒకరుగా అతడి వద్దకు వచ్చి కౌగలించుకుని భరోసాగా భుజం తట్టారు. ఈ విడియో ఇప్పడు కదిలించటం కాదు మనిషన్నవాడిని నిలువునా ఏడ్పించేస్తోంది. 


కాస్సేపయ్యాక అతడు ముఖానికి కప్పుకున్న టవల్‌ తీసేశాడు. తనను నమ్మి కౌగలించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి ఒక్కరికీ సందేశం ఇవ్వడానికే నేనిలా చేశాను. నేనొక ముస్లింని. కాని ముస్లింని కావడమన్నదే నన్ను ఉగ్రవాదిని చేయలేదు. నేను ఎవరినీ చంపలేదు. గత శుక్రవారం (అంటే ఉగ్రవాద దాడులు జరిగిన రోజు) నా పుట్టినరోజు. అయినా నేను నా జన్మదినాన్ని జరుపుకోలేదు అన్నాడతడు. బాధితుల కుటుంబాల బాధను తనదిగా భావిస్తున్నానన్నాడు. 


నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముస్లిం అంటేనే ఉగ్రవాది కానక్కర్లేదు. ఉగ్రవాది ఉగ్రవాదే. కొంతమంది నిష్కారణంగా మనుషులను చంపాలనుకుంటూ ఉంటారు. ఒక ముస్లిం అలా ఎన్నటీకీ చేయడుత. మా మతం అలా చంపడాన్ని నిషేధిస్తోంది అంటూ సమస్త ముస్లింల తరపున ప్రతినిధిగా మాట్లాడాడతను. 
మతాల అడ్డంకులను తొలగించుకుని పారిస్ వాసులు అతడిని కౌగలించుకోవడం చాలా మంచి పరిణామం. ఆ ఘటన మనుషులలో మానవత్వ స్పర్శ ఇంకా అంతరించిపోలేదని నిరూపించింది.


నిజమే. అదొక చిన్న సందేశం. కాని ఆ సందేశం ఎంత శక్తివంతమైనదంటే మనుషుల మధ్య ఉన్న సమస్త సరిహద్దులనూ చెరిపివేస్తోంది. వారి చరిత్రలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోరమైన ఉగ్రవాద దాడితో భీతిల్లిపోయిన దేశానికి కొండంత ఆశను తీసుకొచ్చిందది. ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పుల్లో అసువులు బాసిన బాధితులకు నివాళి పలికేందుకు అక్కడ గుమికూడిన వందలాదిమందికి ఒక ముస్లిం ఇచ్చిన శాంతి సందేశమిది. 


పారిస్ సమాజాన్ని నిలువునా విభజించి ధ్వసం చేయడానికి ఐసిస్ చేసిన ప్రయత్నాన్ని ఆ వ్యక్తి, పారిస్ వాసులూ వమ్ము చేశారు. ముస్లిం అయినంత మాత్రాన ఉగ్రవాది కానక్కర్లేదని అతడిచ్చిన సందేశాన్ని ఫేస్‌బుక్‌లో కోటిమంది చూశారు. రెండు రోజుల్లలో లక్షా 50 వేలమంది లైక్ చేశారు. 


నిజంగానే పారిస్ తనకు తాను పరీక్ష పెట్టుకుంటోందిప్పుడు. పక్కవాడిని నమ్మాలా వద్దా.. పరమతస్థులతో మెలగాలా వద్దా? ఈ క్రమంలోనే ఆ ముస్లిం పెట్టిన పరీక్షలో అది పూర్తిగా నెగ్గింది. ఉగ్రవాదం ఆయుధాలతో, బలగాలతో అణిగేది కాదని, ప్రజల దృఢ సంకల్పం, వారి ఐక్యతే దాన్ని మట్టుబెడుతుందని ఆ ముస్లిం పారిస్ సమాజాన్ని కలిపి మరీ నిరూపించాడు. అందుకే అతడికి అందరి అభినందనలు దక్కాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: