సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే.. ప్రభుత్వాల పుట్టుకతో పాటూ.. పార్టీల మధ్య అసంత్రుప్తులు పుట్టడం కూడా చాలా సహజం. ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరుగుతోంది. ఇక్కడ నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ యూ, లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలూ మూడూ కలిసి మహాకూటమి లేదా లౌకిక కూటమి పేరుతో కలిసి పోటీచేసి.. మోడీ సారథ్యంలోని ఎన్డీయే ను మట్టి కరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నితీశ్ సర్కారు గద్దె ఎక్కిన వెంటనే.. ఆ పార్టీల మధ్య అసంత్రుప్తులు కూడా బయటకు వస్తున్నాయి. మంత్రివర్గం కూర్పుతోనే ఒక్కొక్కటి బయటపడుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నిజానికి నితీశ్ మంత్రివర్గ కూర్పు విషయంలో కూటమిలో అత్యంత కీలక భాగస్వామి అయిన లాలూప్రసాద్ యాదవ్ ఏ మాత్రం అసంత్రుప్తి చెందడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పార్టీకి 12 మంత్రి పదవులు దక్కాయి. పైగా ఎమ్మెల్యేలుగా గెలిచిన  ఆయన కొడుకులిద్దరూ కూడా మంత్రులయ్యారు. ఒక కొడుకు ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ ను కూడా సొంతం చేసుకున్నాడు. డిప్యూటీ పదవితో పాటూ... లాలూ ప్రసాద్.. హోం మంత్రిత్వ శాఖను కూడా తన రెండో కొడుక్కి కోరుతున్నట్లుగా గతంలో పుకార్లు వచ్చాయి గానీ.. సదరు రెండో కొడుక్కి ఆరోగ్య శాఖ మాత్రమే దక్కింది. ఏది ఏమైనప్పటికీ.. ‘జనులా  పుత్రుని కనుగొని పొగడగ’ అన్న సుమతీ శతకం పద్యం లాగా.. లాలూప్రసాద్ ఇద్దరు కొడుకులనూ చూసుకుని మురిసిపోయే స్థితిలో ఉన్నారు గనుక.. ఆయనకు ఇబ్బంది లేదు.


ఇక వచ్చిన చిక్కల్లా కాంగ్రెసు పార్టీతోనే. మంత్రి వర్గ కూర్పు మీద ఈ పార్టీలో అసంత్రుప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి అసంత్రుప్తి ఏమిటి ? కూటమి దయపెట్టిన సీట్లు తీసుకుని వెళ్లిపోకుండా అనుకోవచ్చు గానీ.. పదవుల వరకు వచ్చేసరికి వారికి అసంత్రుప్తి మామూలైపోయింది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు 4:4:2 నిష్పత్తిలో మంత్రి పదవులు పంచుకోవాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దామాషా ప్రకారం లెక్కవేస్తే కాంగ్రెసుకు అన్యాయం జరిగింది. మొత్తం 28 మంత్రిపదవులు ఉండగా.. జేడీయూ, ఆర్జేడీ లకు 12 లెక్కన దక్కాయి. కాంగ్రెసు 4కే పరిమితం అయింది. కనీసం తమకు మరొక మంత్రి పదవి అయినా ఇచ్చి ఉండాల్సిందని వారు పాపం వాపోతున్నారట. అయినా కూటమిలో భాగం, సీట్లు ఇచ్చిందే ఎక్కువ.. మళ్లీ మంత్రి పదవుల కోసం అసంత్రుప్తి చెందవచ్చు గానీ.. అలక వహించే స్థితిలో కాంగ్రెసు పార్టీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: