వరుస వర్షాలతో రాయలసీమ మొత్తం వరదలతో కుదేలైంది. వరుస వర్షాలతో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు జలమయమయ్యాయి. వరద తీవ్రతను అంచనా వేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్న వాదనలు ఉన్నాయి. మొదట్లో అట్టర్ ఫ్లాప్ అయిన టీడీపీ సర్కారు.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏకంగా సీఎం రంగంలోకి దిగాల్సి వచ్చింది. చంద్రబాబు అక్కడే మకాం వేసి పనులు దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రకృతి విపత్తుల సమయంలో సర్కారు యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలి. అందుకు తగినట్టుగా నిధుల విడుదల చక చకా జరగాలి. ఐతే.. చంద్రబాబు నిధులు సరిగ్గా విడుదల చేయకుండానే పరామర్శల పేరుతో ఉద్యోగులను నిలదీస్తున్నారన్న విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నాయి. మీడియాలో కవరేజ్ కోసం జనంలోకి వెళ్లి.. వాళ్ల ముందు అధికారులను తిట్టడం అన్నది చంద్రబాబుకు తెలిసిన పాత విద్యే. గతంలో ఆయన ఇలా చాలాసార్లు చేశారు. 

ఇప్పుడు ఈ విషయంలో ప్రతిపక్షనేత జగన్ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారు. నిధులు మంజారు చేయకుండానే అధికారులను బాధ్యులను చేయడంపై మండిపడుతున్నారు.  వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను దబాయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం నిధులు, వనరులిస్తేనే అధికారులు ప్రజలకు సహాయ పడగలరని జగన్ అన్నారు. 

దబాయింపు ద్వారా తమ లోపాలను కప్పిపుచ్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ విషయంలో మీడియా జనం కష్టాలు ఫోకస్ చేయాలని జగన్ సూచించారు.  మీడియా ద్వారానైనా చంద్రబాబులో మార్పు రావాలని కామెంట్ చేశారు. జగన్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో సోమవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: