నారా లోకేశ్ కు ప్రమోషన్ లభించబోతోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే కొడుకును పార్టీలో తిరుగులేని నేతగా ప్రమోట్ చేసిన చంద్రబాబు.. ఆయన భవిష్యత్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సరైన లుక్ గానీ, వాగ్దాటి గానీ, ప్రజాసేవ నేపథ్యం గానీలేని లోకేశ్ ను ఈ స్థాయికి తీసుకురావడానికి చంద్రబాబు బాగానే కష్టపడినట్టు చెప్పుకోవాలి. 

మొదట పార్టీ యువ నేతగా, ఆ తర్వాత పార్టీ సంక్షేమ నిధి కన్వీనర్ గా ప్రమోట్ చేసి.. ఏకంగా ఒక్కసారిగా పార్టీ జాతీయ కార్యదర్శి పదవే కట్టబెట్టారు. ప్రాంతీయ పార్టీల్లో.. అందునా ఏక వ్యక్తి ఆధిపత్యంలోని పార్టీల్లో ఇలాంటి జంపింగులు అంత ఆశ్చర్యకరం కాదనుకోండి. మొత్తానికి లోకేశ్ ను అందలమెక్కించేశారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి కేంద్రమంత్రిని చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది.?

లోకేశ్ ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర రాజకీయాలకు దూరమైపోరా.. దూరమైతే.. 2019 నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఫోకస్ చేస్తారు.. అన్న సందేహాలు కలుగక మానవు. అయితే ఇప్పటికే పార్టీలో లోకేశ్ జోక్యం ఎక్కువైందని విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2019 నాటికి జనం సంగతి పక్కకుపెడితే.. పార్టీలోనే లోకేశ్ పై అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉంది. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. 

అందుకే ప్రస్తుతానికి లోకేశ్ కు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకుని ఢిల్లీకి పరిమితం చేయాలన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అలా చేస్తే 2019 ముందు లోకేశ్ ను రాష్ట్ర రంగంలోకి దింపితే పెద్దగా వ్యతిరేకత ఉండదన్నది చంద్రబాబు ప్లాన్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే ఎలాగూ ప్రభుత్వ వ్యతిరేకత తప్పదు.. అంతేకాదు.. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిని తప్పిస్తారని ఎప్పటి నుంచో వార్తలున్నాయి. ఇప్పుడు అశోక్ ను తప్పించి లోకేశ్ కు ఆ పదవి కట్టబెడాతారంటున్నారు. చూడాలి ఏమవుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: