ఈ ఓటమిని పాజిటివ్‌గా తీసుకుంటున్నట్లు వరంగల్‌ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో మూడోస్థానంలో నిలుస్తున్న భాజపా- తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవయ్య మీడియాతో ప్రకటించారు. తాను ఎప్పటికీ ఈ నియోజకవర్గంలోనే ఉంటానని, ఇక్కడి ప్రజలను వీడిపోయేది లేదని.. తన సంస్థ ద్వారా ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని దేవయ్య వెల్లడించారు. 

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అంతటి మహనీయుడే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడని అంతటి మహనీయుడే ఓడిపోయిన తర్వాత.. ఇక తానెంత అని దేవయ్య వ్యాఖ్యానించడం విశేషం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా తాను ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ఎప్పటికీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను భాజపాను వరంగల్ నియోజకవర్గ పరిధిలో ఇదివరకటి కంటె ఒక మంచి పొజిషన్ కు తీసుకువెళ్లగలిగానని ఆయన చాలా ధీమాగా వెల్లడించారు. 


ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయి.. కనీసం గౌరవప్రదమైన ప్రజాదరణ ఓట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో  మిగిలిపోయిన భాజపా అభ్యర్థి దేవయ్య.. ఈ ఓటమికి సంబంధించి తమ మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని నిందించడానికి మాత్రం  సాహసించడం లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో భాజపా, తెదేపా రెండు పార్టీలూ చాలా చక్కటి సమన్వయంతోనే పనిచేశాయని ఆయన వెల్లడిస్తున్నారు. మరోవైపు  ఎప్పటికీ వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానంటున్న దేవయ్య.. ఐటీ కంపెనీలు వంటివి వరంగల్ కు రావడానికి కూడా ప్రయత్నిస్తానని చెబుతున్నారు. 

ఆయన  ఓటమి బాధను కప్పిపుచ్చుకుంటూ ఎన్ని కబుర్లయినా చెబుతూ ఉండవచ్చు గానీ.. నిన్నటిదాకా తాను ఖచ్చితంగా గెలుస్తానని అంటూ వచ్చి.. ఇవాళ అంబేద్కర్ అంతటి వాడే ఓడిపోయాడు.. నేనెంత అంటూ.. అంతటి మహనీయుడుతో పోల్చుకోవడం చోద్యంగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: