వరంగల్‌కు జరిగిన ఉప ఎన్నికలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి తీర్పు ఇచ్చారు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌లో తమ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మంత్రివర్గ సహచరులతో కలిసి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ప్రజలకు రెండు చేతులెత్తి మొక్కుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. చరిత్రలో లేని విధంగానే.. ప్రతిపక్షాలు ఎవ్వరికీ కూడా డిపాజిట్లు దక్కలేదని.. ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని అన్నారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస తిరుగులేని మెజారిటీని చూపించిందని ఆయన చెప్పారు. 


కేసీఆర్‌ ప్రసంగం ఇలా సాగింది. (ఆయన మాటల్లోనే) :: 
''అపూర్వమైన ఎన్నిక. ఈ ఎన్నిల్లో వెలువడిన ఫలితంతో మా బాధ్యత పెరిగింది. ఇవి మాకు కర్తవ్యాన్ని బోధించిన ఎన్నికలు. మా పాలనకు ప్రజలు అద్దం పట్టినట్లుగా మేం భావిస్తున్నాం. ప్రభుత్వం కార్యాచరణ పట్ల సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లుగా మేం భావిస్తున్నాం. 


వరంగల్‌ ప్రజలు తెలంగాణ సాధించిన సందర్భంలోను, ఎన్నికల్లో తెరాస పోటీచేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు పాలనలో ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడంలోను ముందంజలో ఉన్నారు. 


మా ప్రభుత్వం పట్ల ప్రతిపక్షాలకు ఉన్న అసహనం తగ్గించుకోవాలి. అది వారికే మంచిది కాదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిదోరోజునే నా దిష్టిబొమ్మలను తగలబెట్టించారు. అలాంటి వెకిలి చేష్టలకు ఇవాళ వరంగల్‌ ప్రజలు సమాధానం చెప్పారు. ఇంత ఓర్వలేనితనం ప్రతిపక్షాలకు మంచిది కాదు. అర్థం పర్థం లేకుండా, హద్దూ పద్దూ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వ్యక్తిగత నిందరోపణలు, అర్థసత్యాలు, అసత్యాలతో దూషించడం చేస్తూ వచ్చారు. కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని ఒకరు, మరో రకంగా ఒకరు అంటూ వచ్చారు. వారి మాటలను తిప్పికొడుతూ.. వారెవ్వరికీ ప్రజలు డిపాజిట్టు కూడా రానివ్వకుండా ఎన్నికల్లో తీర్పు చెప్పడం జరిగింది. 


ఓట్లు కొనుక్కుంటే వచ్చిన ఓట్లు కాదు. ప్రజలు ఇష్టంగా వచ్చి వేసిన ఓట్లు. పోలింగ్‌ జరిగిన రోజునే 69 శాతం పోలింగ్‌ జరిగిందని అందరూ చెప్పినప్పుడు నేను ఒకే మాట అన్నాను. తీర్పు సగం సగం ఉండదు. స్పష్టంగా ఉంటుంది. మనకు మంచి మెజారిటీ అయినా ఇస్తారు. లేదా, యాంటీఓట్‌ జరిగితే.. పూర్తిగా మనల్ని తిప్పికొడతారు అన్నాను. 


ఇవాళ అదే జరిగింది. ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. అత్యద్భుతమైన మెజారిటీతో ఎంపీని గెలిపించారు. ఇందుకు వరంగల్‌ ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా.. ధన్యవాదాలు తెలియజేస్తున్నా'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: