వరంగల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా విలక్షణమైనది. ఇంత స్పష్టమైన తీర్పును ఇవ్వడం అనేది చాలా గొప్ప పాయింట్‌గా పలువురు పరిగణిస్తున్నారు. వరంగల్‌ ఎంపీ స్థానంలో గతంలో కూడా తెరాసకే చెందినది కావచ్చు గాక.. అంతమాత్రాన మళ్లీ మళ్లీ ఆ పార్టీ అక్కడ విజయం సాధించాలనే నియమం ఎంతమాత్రమూ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనుక, వారు గతంలో నాలుగు లక్షల దాకా ఓట్ల మెజారిటీతో గెలిచారు గనుక.. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు కూడా కొన్ని కారణాల నేపథ్యంలో బలహీనంగా ఉన్నారు గనుక.. మళ్లీ తెరాస గెలుస్తుందని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే.. మరీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తారని మాత్రం చాలామంది ఊహించలేదు. 


అయితే తెరాస విజయాన్ని హేపీగానే స్వీకరించింది. ప్రతిపక్షాలు కూడా.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సి ఉంది. అయితే.. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆత్మవంచన మార్గాన్ని వీడుతున్నట్టుగా కనిపించడం లేదు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. ఈ స్థానంలో తమ పార్టీ అయితే తప్పకుండా గెలుస్తుందని సీటును భాజపాకు కాకుండా, తమ పార్టీకి కేటాయించాలని వారు చాలా దూరం పట్టుపట్టారు. చంద్రబాబునాయుడు అభీష్టానికి వ్యతిరేకంగా.. ధిక్కారస్వరం వినిపించారు కూడా! సీటు మీద అంత నమ్మకం ఉన్న పార్టీ మహా అయితే రెండోస్థానానికి అయినా వస్తుందని ఎవరైనా ఊహిస్తారు. కానీ తెలుగుదేశం మరీ దయనీయంగా.. మూడోస్థానానికి పడిపోవడం మాత్రమే కాదు.. కనీసం తమ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్‌ దక్కేంత మేరకూడా ఓట్లు సంపాదించలేకపోయింది. గెలుస్తాం అని బీరాలు పలికిన పార్టీకి డిపాజిట్‌ రాకపోవడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. 


ఇదంతా ఒక ఎత్తు అయితే.. కనీసం తీర్పు తర్వాత అయినా.. తెలుగుదేశం నాయకులు వాస్తవాలను గ్రహిస్తే.. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో వారికి కాస్త జ్ఞానం కలుగుతుందని అనుకోవచ్చు. కానీ వారు ఆ పని కూడా చేయడం లేదు. ఇంకా ఆత్మవంచన చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నారు. వరంగల్‌ ఉప ఎన్నికల ఫలితాల గురించి ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నర లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన తెరాస మీద జాలి కురిపించడం విశేషం. ఆ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారట. తెరాస ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదిట.. కానీ దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడంలో విపక్షాలు విఫలం అయ్యాయిట. ఇలాంటి వంకర డైలాగులు వల్లిస్తున్నారు. నిజానికి ఆయన వాదన నిజమే గనుక.. అయితే.. అసలు పోలింగ్‌ శాతమే తగ్గిపోవాలి. అలా జరగకుండా పోలింగ్‌ కూడా గణనీయంగా జరిగి, ప్రతిపక్షాలకు డిపాజిట్లు ఇవ్వని తీర్పు వచ్చిందంటే ఖచ్చితంగా అది సర్కారు వారి పాలన పట్ల ప్రజల స్పందనే అనుకోవాలి. ఇప్పటికీ దాన్ని గుర్తించలేకుండా.. ఇలా ఆత్మవంచన చేసుకుంటే వారికే భవిష్యత్తు ఉండదని తెలుసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: