వెనకటికి ఓ నాట్యగత్తె నాట్యం ఆడడం చేతకాక.. మద్దెల సరిగా మోగడం లేదని సాకులు చెప్పిందిట. అంటే ఇండైరక్టుగా మద్దెల దరువు సరిగా మోగితే గనుక.. నాట్యం యిరగదీస్తా అన్నదన్నమాట. ఇప్పుడు భాజపా నాయకుల వైఖరి , వారి మాటతీరు కూడా అందుకు భిన్నంగా ఎంతమాత్రమూ కనిపించడం లేదు. తెలుగుదేశంతో పంతానికి పోయి మరీ వరంగల్‌ ఎంపీసీటును దక్కించుకుని.. అక్కడికేదో తమకు తెగ బలం ఉన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చి, చివరికి సొంత పార్టీ నుంచి నిలబెట్టడానికి అభ్యర్థికి కూడా గతిలేక.. అప్పటికప్పుడు ఎన్నారైను పిలిపించి పార్టీలో చేర్చుకుని బీఫారం ఇచ్చిన భాజపా.. ఫలితాల తర్వాత దారుణంగా చతికిలపడినప్పటికీ కూడా.. ఇప్పటికీ ప్రాక్టికల్‌గా మాట్లాడడం లేదని అనిపిస్తోంది. 


వరంగల్‌ ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేకుండా మూడోస్థానానికి పరిమితం అయి.. గత సార్వత్రిక ఎన్నికల నాడు సంపాదించుకున్న ఓట్ల కంటె ఈసారి మరీ తక్కువ ఓట్లకు దిగజారిపోయిన భారతీయ జనతా పార్టీ.. తెరాస పార్టీ అధికార దుర్వినియోగంతో గెలిచినదంటూ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది. ఇన్నాళ్లుగా ఎన్నికల ప్రచార పర్వంలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా ఎక్కడా భాజపా గానీ, వారి మిత్రపక్షం తెదేపా గానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు దారుణమైన ఓటమి చవిచూడగానే.. వారికి ఒక్కసారిగా తెరాస చేసిన అధికార దుర్వినియోగం మొత్తం పొంగుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. 


జరిగిన ఎన్నికల్లో చతికిలపడ్డారు గానీ.. జరగబోయే ఎన్నికల్లో యిరగదీస్తాం అని భాజపా నాయకులు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీనే విజయం సాధిస్తుందని అంటున్నారు. వరంగల్‌లో అధికార దుర్వినియోగం మరియు డబ్బు వెదజల్లడం ద్వారా మాత్రమే తెరాస విజయం సాధించిందని వారు కొట్టి పారేస్తున్నారు. ఆ మాటకొస్తే.. డబ్బు కుమ్మరించడానికి సరైన పోటీదారు అనే నమ్మకంతో తప్ప.. విదేశాల్లో వ్యాపారాల్లో ఉన్న దేవయ్యను ఎందుకోసం పార్టీలో హటాత్తుగా చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చారో వారికే తెలియాలి. 


అయితే అయిపోయింది వదిలేసి.. రాబోయే ఎన్నికలు తమవే అనే వారి మాటలకు పెద్దగా విలువ దక్కడం లేదు. ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రగల్భాలని కొట్టి పారేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు గెలిచిన కేసీఆర్‌.. గ్రేటర్‌ను కూడా తామే గెలుస్తామని.. తమ పాలనకు అనుకూల ఓట్లు పడతాయని అంటున్నారు. ఎవరి మాటలు నిజమో మరో మూడు నెలల్లో తేలనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: