ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకూ, కేసీఆర్ కూ రాజకీయ వైరం ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. కేసీఆర్ ను ఏకేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా రాధాకృష్ణ వదులుకోడన్న సంగతీ తెలిసిందే. తెలంగాణలో మీడియా దాదాపుగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నా.. ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే నిర్భయంగా సర్కారు వ్యతిరేక వార్తలు రాస్తోంది.  ఏబీఎన్ పై నిషేధం విధించినా ఏమాత్రం వెనక్కుతగ్గలేదు రాధాకృష్ణ.

ఓ జర్నలిస్టుగా రాధాకృష్ణ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఆయన ధైర్యానికి పక్షపాతం తోడైంది. ప్రత్యేకించి ఈ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఆంధ్రజ్యోతి మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక వార్తలు రాసింది. పార్టీలో లుకలుకలున్నాయని.. పార్టీకి ఓటమి భయంపట్టుకుందని రాసేసింది. అక్కడ ఏదో తేడా ఉంది అంటూ విశ్లేషణలు రాసి పారేసింది. ఏ వార్త రాసినా దాని ప్రయోజనం టీఆర్ఎస్ ఓట్లు తగ్గించడమే లక్ష్యం అన్నట్టుగా సాగింది. 

ఇక ప్రచారం ముగిసే రోజుల్లో ఏకంగా కేసీఆర్, కవిత, హరీశ్ రావులపై బ్యానర్ వార్తలు ప్రచురించింది. గత ఎన్నికల్లో వీరు ఈసీకి తప్పుడు లెక్కలు చూపారంటూ వార్తలు వండి వార్చింది. పాపం.. రాధాకృష్ణ తన సృజనాత్మకత అంతా చూపించినా వరంగల్ ఓటరును మాత్రం ప్రభావితం చేయలేకపోయారు. కనీసం టీఆర్ఎస్ పాత మెజారిటీ అయినా తగ్గించలేకపోయారు. 

టీఆర్ఎన్ ను ఎన్నికల్లో దెబ్బ కొట్టకపోగా.. ఆ పార్టీ నిరంతరం అప్రమత్తంగా ఉండేలా ఆంధ్రజ్యోతి కథనాలు ఉపయోగపడ్డాయి. మొదటి నుంచి టీఆర్ఎస్ నమ్మకంతోనే ఉన్నా.. ఆంధ్రజ్యోతి కథనాల నేపథ్యంలో వారు మరోసారి జాగ్రత్తపడ్డారు. మొత్తం మీద ఓరుగల్లు పోరులో తిరుగులేని టీఆర్ఎస్ విజయంలో రాధాకృష్ణ ఆ విధంగా తనవంతు పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. ఇకనైనా ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని నెగిటివ్ వార్తలు రాసేపని మానుకుని.. పక్షపాత రహితంగా జనం కోసం వార్తలు రాస్తే ఆ పత్రిక భవిష్యత్ బావుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: