గ‌త 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి  చూస్తే.. తాజా లోక్ సభ ఎన్నిక‌ల ఫలితాలు ముమ్మాటికి ప్ర‌భంజ‌న‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌లో వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితాలు గ‌త అభ్య‌ర్ధి క‌డియం శ్రీహ‌రి దాదాపుగా 3 ల‌క్షల 92 వేల ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. అప్ప‌ట్లో టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ స్థాయి అభ్య‌ర్ధి ఇంత పెద్ద మెజారిటీ రావ‌డం ఇదే మొద‌టి సారిగా చెప్పొచ్చు. సీఎం కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో లోక్ స‌భ సభ్య‌త్వానికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. దీంతో వ‌రంగ‌ల్ లోక్ స‌భ‌ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార టీఆర్ఎస్  ఊహించని రీతిలో అధ్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. తెలంగాణ లో త‌నకు తిరుగులేద‌ని టీఆర్ఎస్ మ‌రోసారి అద్భుత విజ‌యంతో ప్ర‌క‌టించింది. 

ఓరుగ‌ల్లు ఓట‌ర్లు మాత్రం ఏక‌ప‌క్షంగానే ఓట్లు 


ఎన్నిక‌ల ప్ర‌చార‌మైతే అన్ని పార్టీల నాయ‌కులు పోటా పోటీగా కొన‌సాగించినా.. పోలింగ్ మాత్రం ఏక‌ప‌క్షంగా సాగింద‌న్న విష‌యం ఓట్ల లెక్కింపు లో తేలిపోయింది. ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ లో మొత్తం 22 రౌండ్ల లెక్కింపు అనంత‌రం టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌సునూరి ద‌యాక‌ర్ త‌న ప్ర‌త్య‌ర్ది కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ పై 4,59,092 ఓట్ల అధిక్యంతో విజ‌యం సాధించారు. పూర్తి లెక్కింపు అనంత‌రం పార్టీలకు వ‌చ్చిన ఓట్ల‌ను చూస్తే.. తెలంగాణ రాష్ట్ర స‌మితికి 6,15,403 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీకి 1,56,315 ఓట్లు వ‌చ్చాయి. ఇక బీజేపీ-టీడీపీ  కూట‌మి అభ్యర్ధి దేవ‌య్య కు మాత్రం 1,30,178 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ క‌నీసం రెండు ల‌క్ష‌ల ఓట్లను కూడా సంపాందించ‌లేదు. అయితే ఫ‌లితాలకు ముందు అన్ని పార్టీలు గ‌ట్టి దీమాతో నే ఉన్నారు. గెలుపు మాదంటే మాదేన‌ని ధీమాతో ఉన్నా.. ఓరుగ‌ల్లు ఓట‌ర్లు మాత్రం ఏక‌ప‌క్షంగానే ఓట్లు వేసిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. అధికార పార్టీకి ఆ పార్టీ సైతం ఊహించ‌ని ఫ‌లితాల‌ను ఓరుగ‌ల్లు ఓట‌ర్లు అందించారన‌క త‌ప్ప‌దు. 


అయితే ఈ విజ‌యం వెన‌క దాగి ఉంది మాత్రం ముమ్మాటికి కేసీఆర్ వ్యూహం అని ప్ర‌త్యేకంగా చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌భుత్వం ఏర్పాటు  చేసిన 17 నెల‌ల త‌రువాత జ‌రుగుతున్న ఎన్నిక కావ‌డంతో ఈ ఉప ఎన్నిక‌లో ఏమాత్రం మెజారిటీ త‌గ్గినా కూడా ఆ ఫ‌లితం ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం అయ్యే అవ‌కాశాలు  ఉన్నాయ‌ని గ్ర‌హించిన గులాబీ నేత, సీఎం  కేసీఆర్ అటువంటి విమర్శ‌ల‌కు ఏ మాత్రం తావివ్వ‌కుండా వ్యూహాలు ప‌న్నారు. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక విష‌యంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవడంతో.. కేసీఆర్ నిత్యం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిన‌ట్టు తెలుస్తోంది. ఎంత చిన్న విష‌యమైనా ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చూప‌కండి అంటూ నేత‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్ చేయ‌డం,తాను కూడా స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారం చేయ‌డం  అనేవి భారీ మెజారిటీకి కార‌ణాల‌ని చెప్పుకోవ‌చ్చు. అధికారంలో ఉన్నామ‌న్న ధీమాతోనో.. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌న్న అతి విశ్వాసంతోనో నేత‌లు నిర్ల‌క్ష్యం ప్ర‌దర్శించే అవ‌కాశం లేకుండా ప్ర‌తిరోజూ నేత‌ల‌తో  మాట్లాడుతూ ఉండేవారని స‌మాచారం.


ఇక‌పోతే.. టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఎంపిక విష‌యంలో  గులాబీనేత తీసుకున్న నిర్ణ‌యం కూడా ప్ల‌స్ పాయింటే. ప‌సునూరి ద‌యాక‌ర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి కార్య‌కర్తగా ప‌నిచేసేవాడ‌ని వ‌రంగ‌ల్  లో ప్ర‌చార‌ముంది. ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌డంలో ఏ మాత్రం త‌ప్పుకాద‌న్న వాద‌న ఆ ప్రాంతంలో గ‌ట్టిగానే ఉంది. దీంతో కేసీఆర్ అనూహ్యంగా ద‌యాకర్ ను ఎంపిక చేయ‌డంలో ఆ పార్టీలో ఉన్న క్షేత్ర స్థాయి నాయకుల్లో నూత‌న ఉత్సాహం ఇచ్చిన‌ట్ట‌య్యింది. ఇక‌పోతే వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రులు ప్ర‌చారం, క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న కూడా ఓట‌ర్ల పై తీవ్ర ప్ర‌భావం చూపాయి. అధికార పార్టీ దాదాపు మంత్రులు మొత్తం ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇక‌పోతే అధికార పార్టీ 17 నెల‌ల్లో చేస్తున్న ప్ర‌జా ప‌థ‌కాలు కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పొచ్చు.  రూ.200 పింఛ‌న్ లు.. రూ.1000 పింఛ‌న్ ఇవ్వ‌డం పెద్ద ప్ల‌స్ పాయింట్. అంతేకాకుండా  నిరంత‌ర విద్యుత్ విధానాన్ని తీసుకురావ‌డంతో ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ పార్టీ కి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నాయి. 


 
ఇది ఇలా ఉండ‌గా.. ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్యూహాలు కూడా అధికార టీఆర్ఎస్ కు క‌లిసి వ‌చ్చాయ‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య వ్య‌వ‌హారం కాస్తా ఆ పార్టీకి పెద్ద మైన‌స్. అంతేకాకుండా ఆయ‌న మార్పు త‌రువాత వ‌చ్చిన స‌ర్వే స‌త్యనారాయ‌ణ కూడా వ‌రంగ‌ల్ ప్రాంతం లో ఆయ‌న పెద్ద‌గా ప‌రిచ‌యంలేని వారే. అంతేకాకుండా ఆయ‌న గతంలో కేంద్ర‌మంత్రి గా ఉన్న‌ప్పుడు ఆయ‌న చేసిన అభివృద్ది దాదాపు శూన్య‌మ‌నే చెప్పాలి. దీంతో ఆయ‌న వరంగ‌ల్ ఓటర్ల‌కు ఆక‌ర్షించ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్ధి దేవ‌య్య‌ దాదాపుగా పార్టీలో కొత్తగా వచ్చిన‌వారే. గ‌తంలో ఆయ‌న కొన్ని స్వ‌చ్చంద కార్య‌క్ర‌మాలు చేసినా పెద్ద‌గా ఆయ‌న ఓట‌ర్ల మ‌న‌సును గెలుచుకోలేక‌పోయారు. ఇక చివ‌రి క్ష‌ణంలో రంగంలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌ల్లా సూర్య‌ప్ర‌కాశ్ ప‌రిస్థితి దాదాపుగా అంతే. వామ‌ప‌క్షాల అభ్య‌ర్ది గాలి వినోద్ కుమార్ కూడా ఓట‌ర్ల‌ను ఆక‌ర్శించలేక‌పోయారు. ఆయ‌న దాదాపు గా కుల సంఘాల‌ను ఏకం చేయడం లో విఫ‌ల‌మ‌య్యారు. 


అంతేకాకుండా  వామ‌ప‌క్షాలు ఓట్ల బ‌లం దాదాపుగా త‌క్కువ‌నే  చెప్పాలి. ఇక అన్ని పార్టీల ప్ర‌చారాలు బాగానే సాగిన ఓరుగ‌ల్లు ఓట‌ర్లు అధికార పార్టీ తో అభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి టీఆర్ఎస్ పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. మొత్తం మీద గులాబీ బాస్, సీఎం కేసీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టి వ‌రంగ‌ల్ లో భారీ గెలుపును త‌న‌ఖాత‌లో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎమ్మెల్సీ ,  జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మవుతోంది టీఆర్ఎస్ పార్టీ. దాదాపుగా 2019 ఎన్నిలకు త‌మ‌కు అనుకూలంగా ఉండేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు గులాబీ బాస్!


మరింత సమాచారం తెలుసుకోండి: