అధికార పార్టీ చేతిలో మూకుమ్మడిగా డిపాజిట్లు కోల్పోయిన తెలంగాణ ప్రతిపక్షాల పరిస్థితి ముందుంది మొసళ్ల పండుగ లాగా మారుతోంది. కడుపుమంటతో కొందరు, నిరాశతో కొందరు, భవిష్యత్తు లేదన్న భయంతో కొందరు.. ఇలా తెలంగాణ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు మూటా ముల్లే సర్దుకుని నేడో రేపో తెరాసలోకి గెంతేయడానికి ఎక్కువ రోజులు పట్టదనిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడైన మరు క్షణమే తెలుగు దేశం పార్టీలో తొలి వికెట్ కుప్పగూలడం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్తవానికి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేయకుండా మిత్రపక్షమైన బీజేపీకి మధ్దతిచ్చినప్పటికీ, ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ దొమ్మాటి సాంబయ్య తెలంగాణలో పార్టీ నాయకత్వం తీరుపట్ల విసుగెత్తిపోయి కాడి కింద పడేశారు.

 

ఈసారి వరంగల్ ఎంపీ స్థానంలో పోటీచేయడానికి తనకే సీటు ఇస్తారని సాంబయ్య కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు బీజేపీకి దాసోహమైపోయో లేక వ్యూహాత్మకంగా వ్యవహరించో ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో సాంబయ్య ఆశలు గల్లంతయ్యాయి. పైగా తెలంగాణ టీడీపీ నాయకత్వం తనను, తనలాంటి పార్టీలోని ఇతర దళిత నేతలను ఎదిగడానికి అవకాశం లేకుండా చేస్తోందని సాంబయ్య ఆరోపించారు.

 

ఈ కారణంపైనే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన సాంబయ్య మరోవైపున పార్టీ అధినేత చంద్రబాబును మాత్రం మంచి మనిషి అని పొగడడం విశేషం. కానీ వరంగల్ జిల్లా నాయకత్వమే పార్టీని దుంపనాశనం చేస్తోందని సాంబయ్య ఆరోపించారు. కాగా గతంలో ఓడినప్పటికీ ఈసారి కూడా వరంగల్ సీటు తనకే కావాలని పట్టుబట్టి మరీ బాబును ఒప్పించి పోటీలో నిలిచిన బీజేపీ నాయకత్వ వైఖరిపై ధ్వజమెత్తుతో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కూడా ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

 

దీన్ని చూస్తుంటే త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా తెరాసలోకి వలసలు మొదలయ్యేటట్టున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: