తెలుగు దేశం జాతీయ పార్టీ.. తెలుగు రాష్టాల్లోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ లోనూ సత్తా చాటుతుంది.. పార్టీని మరింతగా విస్తరించాలి. దేశవ్యాప్తం చేయాలి.. ఇవీ మహానాడు సాక్షిగా నాయకులు చెప్పిన కబుర్లు కానీ.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూస్తే అది కాస్తా కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతుందేమో అన్న సందేహాలు వచ్చేలా ఉంది. 

వరంగల్ ఉప ఎన్నిక ఫలితం టీడీపీని తీవ్ర నిరాశకు గురి చేసింది. కనీసం రెండో స్థానం కూడా రాలేదు. డిపాజిట్టూ దక్కలేదు. ఈ ఘోరపరాజయానికి స్థానిక నేతల వైఖరితో పాటు పార్టీ అధినాయకత్వమూ కారణమేనన్న వాదన వినిపిస్తోంది. గతంలో మెదక్ ఉపఎన్నిక జరిగినప్పుడు చంద్రబాబు చాలా కేర్ తీసుకున్నారు. జనరల్ ఎన్నికలు జరిగిన కొన్నినెలలకే ఎన్నికలు జరిగినా టీడీపీ - బీజేపీ అభ్యర్థి డిపాజిట్ తెచ్చుకున్నారు. 

కానీ ఇప్పుడు సీన్ మారింది. గతంలో కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించిన చంద్రబాబు ప్రస్తుతం అవలంబిస్తున్న మెతక వైఖరే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇక ఘర్షణ పెట్టుకోబోమని చంద్రబాబు మీడియా ముఖంగానే ప్రకటించారు. పంతాలకు పోవడంతో సాధించేది ఏదీ ఉండదని ఆయన రాజకీయ వైరాగ్యం కూడా ప్రదర్శించారు. 

ఇంతటి మార్పునకు కారణం ఒక్కటే అదే ఓటుకు నోటు కేసు. ఆ పరిణామం తర్వాతే చంద్రబాబు వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. కేసీఆర్ తో రాజీ వైఖరి ప్రదర్శించారు. పైకి అది సుహృద్భావ వాతవరణంగా కనిపించినా అది కేవలం లొంగుబాటు మాత్రమేనని విమర్శించేవారూ ఉన్నారు. ఏదేమైనా ఇక చంద్రబాబు తెలంగాణ టీడీపీపై ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. 

వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై చంద్రబాబు స్పందన కూడా ఈ విశ్లేషణకు ఊతమిస్తోంది. మీడియా ఆయనను దీని గురించి అడిగితే.. ఆయన సింపుల్గా..  కామెంట్ ఏముంది.. సమీక్షించుకుంటాం అని తేల్చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: