వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై విపక్షాల కామెంట్లు భలే నవ్వు తెప్పిస్తున్నాయి. వాస్తవానికి ఇంత బంపర్ మెజార్టీ టీఆర్ఎన్ నాయకులు సైతం ఊహించలేదు. ప్రజా తీర్పును ఒప్పేసుకుంటున్నామంటూనే విపక్షాలు సరికొత్తవాదనలను తెరపైకి తెచ్చాయి. టీఆర్ఎస్ ను గెలిపించకపోతే పథకాలు అమలు కావేమో అని జనం భయపడిపోయారని చెప్పుకొచ్చారు. 

ఇక శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ కూడా అదే పాట పాడారు. గులాబీ పార్టీ ప్రజలను భయపెట్టిందని విమర్శించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తే జైల్లో పెట్టారని అందుకే జనం భయపడ్డారని విశ్లేషించారు. అలాగే ఆయన కేసీఆర్ కు ఓ సవాల్ కూడా విసిరారు. తన పాలనను జనం మెచ్చుకుంటున్నారని కేసీఆర్ నమ్మితే.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారి రాజీనామాలు ఆమోదించి ఎన్నికలు జరిపించాలని సవాల్ చేశారు. 

షబ్బీర్ అలీ ఏదో కవర్ చేసుకునేందుకు ఈ సవాల్ విసిరినా ఇది టీఆర్ఎస్ నేతలు ఆలోచించాల్సిన విషయమే. టీఆర్ఎస్ క్యాబినెట్లో టీడీపీ మంత్రి అని ఇప్పటికీ తలసాని శ్రీనివాసయాదవ్ విమషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వమా అన్న వెటకారాలూ వినిపించాయి. ఇవన్నీ ఒక్క తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా ఆమోదించకుండానే కేబినేట్లోకి తీసుకోవడం వల్లనే వచ్చాయి. 

జనం ఇంకా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మొన్నటి మెదక్ ఉప ఎన్నిక, నేటి వరంగల్ ఉప ఎన్నిక తేల్చి చెప్పాయి. అలాంటప్పుడు ఆ తలసాని మచ్చ మాత్రం గులాబీ ప్రభుత్వంపై ఎందుకు.. అని కొందరు టీఆర్ఎస్ నాయకులు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే సనత్ నగర్ అంటే మెదక్, వరంగల్ ఉపఎన్నికలంత సులభమైన వ్యవహారం కాదు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా గులాబీ నాయకులు పట్టించుకోడవం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: