తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ గా ఉందని కొన్నేళ్లుగా వార్తలు వచ్చాయి. అది వాస్తవం కూడా.. 2005 నుంచి 2008 వరకూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ సమయంలో హైదరాబాద్ భూముల ధరలను విపరీతంగా పెంచేశారని.. ఒకేసారి 15-20 సంవత్సరాల పెరుగుదల చూపించారని విమర్శలు కూడా ఉన్నాయి. 

ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, విభజన వంటి కారణాలతో హైదరాబాద్ మార్కెట్ స్తబ్దుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు క్రమంగా సీన్ మారుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అది హైదరాబాద్ లో మళ్లీ రియల్ భూమ్ పుంజుకుంటోందనడానికి సంకేతం.

ఇప్పుడు తెలంగాణ సర్కారు భూముల అమ్మకంతో.. సంకేతాల విశ్లేషణతో పని లేకుండానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఏంటో లోకానికి తెలిసిపోతోంది. తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ.. బుదవారం హైదరాబాద్ లో కొన్ని భూములను వేలం వేసింది. ఈ ఈ వేలంలో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిల్లో భూములు అమ్ముడుపోయాయి. 

గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గంలో అరబిందో ఫార్మా సంస్థ దాదాపు ఎకరానికి 30 కోట్లు రూపాయలు వెచ్చించి ఐదు ఎకరాలు కొనుక్కుంది. అదే సంస్థ అక్కడే మరో స్థలాన్ని ఎకరం 25 కోట్లు పెట్టి దాదాపు నాలుగు ఎకరాలు కొనుక్కుంది. మణికొండలో ఎకరం 13 కోట్లు, కోకాపేటలో ఎకరం 6 కోట్లు ధర పలికింది. ఇప్పటి వరకూ హైదరాబాద్ లో ఎకరం 23 కోట్లు రికార్డుగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. సో.. మళ్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటోందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: