రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక సమావేశాల్లో ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మాటలయుద్ధం ఆసక్తి రేపింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆంధ్రాకు చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. యూపీఏ మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. దీనికి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ ఎంపీ  అంతా రాజ్యాంగ బద్దంగానే జరిగిందని యూపీఏ ను వెనకేసుకొచ్చారు.  

అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యేక పార్లమెంటు భేటీలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని చర్చకు తెచ్చారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యుపీఏ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఏపీ అసెంబ్లీ మెజార్టీతో తీర్మానం పంపిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఓ మంచి సోదరుడిగా కాకుండా విధ్వంసకర పెద్దన్నగా కేంద్రం అప్పట్లో వ్యవహరించిందన్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు.
 
ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్లమెంటును వేడెక్చించాయి. రాజ్యాంగ గొప్పదనం గురించి అంతా మాట్లాడుతుంటే మధ్యలో ఈ గొడవేంట్రా బాబూ అనుకున్నారు కొందరు. రామ్మోహన్ ప్రసంగంపై టీఆర్‌ఎస్‌ సహా తెలంగాణ పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రామ్మోహన్ వివరణ ఇచ్చారు. తాను విభజనను వ్యతిరేకించడం లేదని.. కానీ విభజన జరిగిన తీరును తప్పుబడుతున్నానని వివరణ ఇచ్చారు. 

రామ్మోహన్‌ ప్రసంగం తర్వాత మైకు అందుకున్న తెలంగాణ ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి అందుకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజనలో రాజ్యాంగాన్ని తప్పుపట్టడం ఏమాత్రం  సరికాదన్నారు. ఏడేళ్ల క్రితం రామ్మోహన్‌ నాయుడి తండ్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎర్రన్నాయుడు రాష్ట్రంలోని ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించారని, పార్టీ కమిటీ తరపున తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ప్రణబ్‌ ముఖర్జీకి సమర్పించారని గుర్తు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: