మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం అయిపోతున్నదని కేవలం కొన్ని ఓట్లను కొనుక్కోవడం ద్వారా.. అవాంఛనీయ శక్తులు కూడా అధికారంలోకి రాగలుగుతున్నాయని.. ఇలా ఓటింగ్‌ వ్యవస్థలో ఉన్న అనేకానేక లోపాల గురించి.. మేధావులు పలు సందర్భాల్లో తరచుగా మాట్లాడుతూనే ఉంటారు. ఓటర్ల జాబితాల్లో లోపాలను చక్కదిద్దితే ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేని ఎన్నికలు జరుగుతాయని.. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ్‌ వంటి వారు అంటూ ఉంటారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రభుత్వ సదుపాయాలు రద్దు చేయాలని వాదించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ గరిష్టంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటే గనుక.. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసేవాళ్లు, బెదిరించి ఓట్లు వేయించుకునేవాళ్లు నెగ్గలేరనేది వాస్తవం. అయితే ఓటుహక్కును తప్పనిసరి బాధ్యతగా చేస్తే తప్ప అది సాధ్యం కాదు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకుంటాయా? రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజల మదిలో రేకెత్తుతున్న ప్రశ్న ఇది. 


ఇదే ప్రశ్నను తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంటులోనూ ప్రస్తావించారు. రాజ్యాంగంలో ఉన్న లోపాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో ప్రస్తావించిన రామ్మోహన నాయుడు.. ఈదేశంలో నిర్బంధ ఓటు హక్కు ఉండాల్సిన ఆవశ్యకతను కూడా వివరించారు. ఓటు హక్కును తప్పనిసరి చేస్తూ ఆ విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరం గురించి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. 


నిజానికి ఓటుహక్కు తప్పనిసరి కావడం వల్ల ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందన్న వాదనను ఎవరైనా ఒప్పుకుంటారు. ఓటు తప్పనిసరి.. అయితే.. ఇవాళ గైర్హాజరవుతున్న 'అప్పర్‌ సొసైటీ' కిచెందిన వారు.. అందరూ కూడా పోలింగ్‌ పాల్గొనే రోజు వస్తే గనుక.. అనర్హులు ఎన్నికయ్యే ప్రమాదం ఉండబోదని మేధావులు చేసే వాదన అప్పటికి నిజమవుతుంది. అందుకే రాజ్యాంగదినోత్సవం రోజున ఎంపీ రామ్మోహన్‌ ఓటుహక్కు నిర్బంధం చేయడం గురించి చేసిన సూచన బాగానే ఉన్నది గానీ.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపిస్తుందా అని విశ్లేషకులు సందేహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: