తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో తమ గళం వినిపించే వాగ్ధాటి, పటిమ ఉన్న నాయకుల లోటు ఈ విడతలో ఒక రకంగా తీరిపోయిందనే చెప్పాలి. గతంలో సబ్జెక్టు మాట్లాడగలిగిన నాయకులు కొందరు పార్టీకి ఉన్నప్పటికీ.. వారు మంచి ఇంగ్లిషు, హిందీ భాషల్లో విషయాన్ని సూటిగా ప్రెజంట్‌ చేసి, సభను మెప్పించే స్థాయిలో మాట్లాడగలిగేవారు కాదు. అయితే ప్రస్తుతం ఆ కొరత లేదనే అనుకోవాలి. ఎందుకంటే... విద్యావంతులైన యువ ఎంపీలు చక్కటి వాగ్ధాటితో పార్లమెంటులో తెలుగుదేశం వాదనల్ని వినిపిస్తున్నారు. ఈ దిశగా ఇదివరకే గుర్తింపుతెచ్చుకున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు గురువారం రాజ్యాంగదినోత్సవం సందర్భంగా రాజ్యాంగం గురించి జరిగిన చర్చలో కూడా తన ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్నాడు. 


రాజ్యాంగ నిర్మాణం, భారత రాజ్యాంగ విశిష్టత గురించి ఎక్కువ మంది ప్రస్తావిస్తూ ఉండగా ఈ యువ ఎంపీ.. రాజ్యాంగంలోని లోపాల వలన దేశ ప్రజల సెంటిమెంట్లకు ఎలా భంగం కలుగుతోందో.. రాజ్యాంగంలో ఉన్న లోపాలను ప్రభుత్వాలు ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో.. రాజ్యాంగంలో ఇంకా ఎలాంటి సవరణలు తీసుకురావాల్సి ఉందో ప్రస్తావించడం ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెలుగురాష్ట్ర విభజన విషయాన్ని కింజరాపు సభలో ప్రధానంగా ప్రస్తావించారు. అప్పట్లో విభజన వద్దంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే.. కేంద్రం దాన్ని పట్టించుకోకుండా.. విభజించిందని అంటూ.. అలా రాష్ట్ర అసెంబ్లీల తీర్మానాల్ని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఇచ్చే వెసులుబాటును యూపీఏ సర్కారు దుర్వినియోగం చేసిందన్నారు. అలాగే ఎన్డీయే హయాంలో ఏర్పడ్డ కొత్తరాష్ట్రాల విషయంలో ఇలా జరగలేదని గుర్తు చేయడం విశేషం. 


నిజానికి కింజరాపు రాజ్యాంగంలోని అంశం గురించి లేవనెత్తితే.. దానిని విభజనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలాగా తీసుకుంటూ.. కాంగ్రెస్‌, తెరాస నాయకులు కుతకుతలాడిపోవడం విశేషం. రెండు పార్టీలకు చెందిన ఫ్లోర్‌లీడర్లూ దీనిని రాజ్యాంగం సమస్యలాగా కాకుండా, విభజనకు సంబంధించిన ఆరోపణలాగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే దీనిని వ్యతిరేకించారు. 


అయితే తెరాస ఫ్లోర్‌లీడర్‌ జితేందర్‌రెడ్డి రాజ్యాంగం గురించిన పాయింటును వదిలేసి.. విభజనకు తెలుగుదేశం పార్టీ కూడా ఎలా సహకరించిందో.. చరిత్ర మొత్తం చెప్పడానికి ప్రయత్నించారు. కింజరాపు కుర్రాడు సూటిగా రాజ్యాంగంలోని అంశాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెబితే.. ప్రతిపక్షాల వారు మాత్రం.. పాయింటుకు దూరంగా ప్రతివిమర్శలు చేయడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: