సినిమాల్లో హింస, శృంగారం గురించి చర్చ వస్తే.. ఎప్పుడూ ఒక రొటీన్ డైలాగ్ వినిపిస్తుంది. చూసేవారు ఉన్నారు కాబట్టే మేం అలాంటి సినిమాలు తీస్తున్నాం అంటారు హీరోలు, నిర్మాతలు.. అదే ప్రేక్షకులను అడిగితే.. వాళ్లు అలాంటివే తీస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం.. అంటుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా విషయంలోనూ రిపీటవుతోంది. 

సెలబ్రెటీలకు చెందిన ఏ చిన్న విషయం దొరికినా మీడియా వదలిపెట్టదు. ఇక 24 గంటళ్ల న్యూస్ ఛానళ్లు ఓ 24 వచ్చేశాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ పోటీయే. రేటింగ్ రేసులో అలుపెరగని పోరాటమే. ఆ పోరాటంలో అది అవసరమా.. అలాంటి కార్యక్రమానికి అంత ప్రాధాన్యం అవసరమా అన్న విచక్షణ అన్నదే పూర్తిగా మరచిపోతున్నాయి చాలా ఛానళ్లు. 

ఉదాహరణకు శుక్రవారం చంద్రబాబు మనవడి దేవాంశ్ పుట్టు వెంట్రుకలు తీశారు. ఈ కార్యక్రమానికి తాతలు చంద్రబాబు, బాలకృష్ణ వచ్చారు. ఇక లోకేశ్, బ్రహ్మణి ఎలాగూ ఉండాల్సిందే. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కనీసం పెళ్లి లాంటి కార్యక్రమం కూడా కాదు. అయినా మీడియా పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి కూడా ప్రత్యక్ష ప్రసారాలు పెట్టి హంగామా చేసేసింది. 

అంతేకాదు.. వార్తల్లో ఇక ముఖ్యమైన అంశాలే లేనట్టు.. బులెటిన్ల ప్రారంభంలోనే దాదాపు పావుగంట సేపు దేవాంశ్ పుట్టువెంట్రుకల కార్యక్రమమే చూపించాయి. ఇందుకు ఏవో కొన్ని చానళ్లు మాత్రమే మినహాయింపు. టీవీ తాత-మనవడు అని టైటిల్ పెడితే.. ఎన్టీవీ నారావారి నీలాలు అని పెట్టి దంచికొట్టారు. బహుశా గతంలో ఏ సెలబ్రెటీ పుట్టు వెంట్రుకల కార్యక్రమం కూడా ఇంతగా మీడియాలో ప్రసారం అయినట్టు లేదు.  

అలాగని ఈ కార్యక్రమం ప్రసారం చేయడం పూర్తిగా తప్పుడు నిర్ణయం అంటామా.. అంతా సెలబ్రెటీలే.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, బ్రహ్మణి.. అలాంటి కార్యక్రమం ప్రసారం చేస్తే జనం తప్పకుండా చూస్తారు. అందులో సందేహం లేదు. రేటింగులూ వస్తాయి. మరి ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలా.. వద్దా.. ఓ చిన్నవార్తలా ఇచ్చి మిగిలిన ప్రాధాన్యాంశాలకు స్థానం కల్పించాలా.. ఇలాంటి చిక్కుప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అనే నానుడి ఉండనే ఉంది కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: