విభజన కష్టాలనుంచి అణుమాత్రం బయటపడని ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు కలికానిక్కూడా కనిపించకున్నా ఉద్యోగాలను సాధించే సామర్థ్య స్థాయిల పట్టిక విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 22 నుంచి 25 ఏళ్ల వయస్సు లోని యువతలో 65,2 శాతం మంది ఉద్యోగం సంపాదించుకోగల కార్మికుల్లో భాగమై ఉన్నారని ఆన్‌లైన్ సర్వే తెలిపింది. భారత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది ఉద్యోగాలను సాధించుకోలిగినంత యుపత లేదని ఈ సర్వేలో తేలింది.

 

భారత వాణిజ్య సమాఖ్య, లింక్‌డిన్,  పీపుల్ స్ట్రాంగ్, భారతీయ యూనివర్శిటీల అసోసియేషన్‌ కలిపి ఏర్పాటు చేసిన వీబాక్స్ సర్వే సంస్థ అత్యధిక ఉపాధి సామర్థ్య స్థాయిల్లో ఏఏ రాష్ట్ర్రాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయంపై ఆన్‌లైన్‌లో మదింపు చేసింది. ఈ మదింపులో ఆంద్రప్రదేశ్ అత్యున్నత స్థానంలో నిలిచిందని ఆ సర్వే పేర్కొంది.

 

రాష్ట్రం మొత్తంమీద విశాఖపట్నం ఉపాధి సామర్థ్యానికి సంబంధించి 31 శాతం వృద్ధితో 85.53 శాతం వద్ద నిలువగా, గుంటూరు పట్టణం 81.07 శాతం సాధించింది. అత్యధిక ఉపాధి సామర్థ్య సూచికలో ఈ రెండు నగరాలూ తొలి రెండు స్థానాలన సాధించడం విశేషం.

 

దేశంలోని 29 రాష్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 5 వేల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో వీబాక్స్ ఈ సర్వే చేసింది. గణాంక, తార్కిక సామర్థ్యం, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు, స్థానిక పరిజ్ఞానం వంటి పలు పరామితులలో ఉద్యోగాలు సాధించే సామర్థ్యం తీరును ఈ సర్వేలో అంచనా వేశారు. ఈ అన్ని పరామితుల్లోనూ దే్శంలోని అన్ని రాష్ట్ర్రాల సామర్థ్యతా స్థాయిని ఆంధ్రప్రదేశ్ అవలీలగా అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.

 

ప్రభుత్వోద్యోగాలు కనుచూపు మేరలో లేకుండా ఎండమావిని తలిపిస్తున్నప్పటికీ, ఆంధ్ర యువత ఉద్యోగాల సాధనలో ఏమాత్రం వెనుకబడి లేదని ఈ విషయం స్పష్టం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: