తెలంగాణలో కాంగ్రెస్ ఇక బతికి బట్టకడుతుందన్న ఆశలు ఇప్పుడెవరికీ లేవు. వరంగల్ ఉప ఎన్నికకు ముందు ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుండే ఎల్లుండి తెలంగాణాలో కాంగ్రెస్ మళ్లీ చక్రం తిప్పవచ్చు అనే ఆశ కాంగ్రెస్ నేతలు కొందరిలో ఉండేది కానీ, ఆ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రతిపక్షాలను అన్నింటికి బండకేసి బాదిపడేయడంతో ఇక తమకు పుట్టగతులు లేవని నేతలందరికీ అర్థమైపోయింది.

 

ఇప్పుడేం చేయాలి. ఈ అవమానాన్ని ఎలా భరించాలి. తెరాస శ్రేణుల ముందు ఎలా తల ఎత్తుకుని బతకాలి అని టీ కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉప ఎన్నిక ఫలితం నేటికీ మింగుడు పడకుండా చేష్ట లుడిగిన కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్దమనిషి ధివ్యమైన సలహా ఇచ్చి పడేశారు. అది తెలంగాణలో కాంగ్రెస్ సక్సెస్ పార్ములా అన్నమాట. ఇంతకూ ఆ దివ్యమైన సలహా ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు సీనియర్ కాంగ్రెస్ నేత ఎం. సత్యనారాయణ రావు.

 

ఆయన తన అనుభవాన్నంతటినీ ధారపోసి ఇప్పుడేం చేయాలో ఒక ఉచిత సలహా పడేశారు. సోనియా గాంధీ ఇకనైనా తెలంగాణను టీఆరెస్‌ పార్టీకి వదలి పెట్టి దాన్ని కేంద్రస్థాయిలో యూపీఏలోకి చేర్చేసుకుంటే పోయే అనేశారు ఎమ్మెస్మార్. తెలంగాణను టోకున టీఆరెస్‌కు అప్పగించేసి ప్రతిగా తెలంగాణ నుంచి లోక్ సభ సీట్లను, రాజ్య సభ సీట్లను తెరాసను ఒప్పించి కాంగ్రెస్ తీసేసుకుంటే రెండు పార్టీలూ లాభపడతాయని సలహా ఇచ్చేశారాయన.

 

ఈ క్షణంలో తెరాసను తెలంగాణలో ఎవరూ ఏమీ చేయలేరు. దాన్ని ఓడించడం కాంగ్రెస్ వల్ల కానిమాటే. కాబట్టి వీరిద్దరూ పరస్పరం మిత్రులుగా ఉంటే ఇరువురికీ ప్రయోజనం కలుగుతుందిని ఎమ్మెస్సార్ చావు కబురు చల్లగా చెప్పేశారు. ఇదంతా తెరాస్ ఒప్పుకున్నప్పటి మాటే అనుకోండి. కానీ కాంగ్రెస్‌లో ఉన్న సమస్యే ఇది. ఆ పార్టీలో ఎవ్వరైనా ఏ స్థాయి నేత అయినా ఇష్టం వచ్చినట్లు తన అభిప్రాయాన్ని ప్రకటించేయగలరు. దాని పర్యవసానాలెలా ఉంటాయని కనీసం ఆలోచించకుండానే తమ తమ అభిప్రాయాలాను ప్రచారాంలో పెడుతుంటారు. ఇందుకే తెలంగాణను ఇచ్చింది తామే అనే భావాన్ని సెంటిమెంటుగా మలిచి ప్రయోజనం పొందడంలో కూడా కాంగ్రెస్ ఘోరంగా వెనుకబడిపోయింది.

 

అయినా మనలో మన మాట.. కాంగ్రెస్‌లో నిన్న గాక మొన్న వచ్చి చేరిన చోటా మోటా నేతల నుంచి పార్టీలో పాతుకుపోయిన పెద్దన్న జానా రెడ్డి వరకు అందరూ బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పాత్రధారి రానా అన్నట్లు చచ్చేలోగా ఒక్కసారయినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని తర్వాత చావాలనుకునే వాళ్లే మరి. ఇకనైనా తెలంగాణను తెరాసకు రాసిచ్చి మీ మానాన మీరు బతకండిరా నాయనా అంటూ ఎమ్మెస్సార్ చెబుతున్న ఈ సుద్దులను టీ కాంగ్రెస్ నేతలు ఒక్కరైనా వినే పరిస్థితిలో ఉన్నారా అని.


మరింత సమాచారం తెలుసుకోండి: