సంవత్సరం క్రితం నల్లజాతి కుర్రాడిని నడిరోడ్డుపై అమెరికన్ పోలీసులు కాల్చి చంపిన వైనంపై అధికారికంగా విడుదల చేసిన ఒక గ్రాఫిక్ వీడియో చికాగో నగరంలో తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించింది. శ్వేతజాతి పోలీసులు అహంకారం, చట్టవ్యతిరేక చర్యలపై నిరసన తెలుపుతూ వందలాది మంది చికాగో పౌరులు నగరవీధుల్లో బీభత్సం సృష్టించారు.

 

లాక్వాన్ మెక్‌డొనాల్డ్ అనే నల్లకుర్రాడిపై పోలీసు అధికారి జాసన్ వాన్ డైక్ క్షణాల వ్యవధిలో 16 సార్లు కాల్పులు జరిపి పబ్లగ్గా హత్య చేసిన ఉదంతం వీడియో రూపంలో చూస్తున్న అమెరికా నల్లజాతి ప్రజానీకం కంపించిపోయింది. రోడ్డు మధ్యలో పరుగెత్తుకుంటూ రావడమే నల్లజాతి కుర్రాడి ప్రాణాలను హరించింది. ఎదురుగా వస్తున్న పోలీసు వాహనానికి సమీపంగా అతడు వెళుతుండగా వాహనంలోంచి కిందికి దిగిన మరుక్షణం పోలీస్ అధికారి వాన్ డైక్ అతడికేసి కాల్పులు జరపడం. కిందపడిపోయిన తర్వాత కూడా పిచ్చిగా కాల్పులు జరిపిన ఆ అధికారి కింద పడి గిలగిల కొట్టుకుంటున్న ఆ కుర్రాడికి కనీస సహాయం అందించకపోగా కిందపడిన బాలుడి చేతికేసి తన్నడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపించడంతో యావత్ అమెరికన్ సమాజం నివ్వెరపోయింది.

 

పోలీసు అదికారి కేవలం 30 సెకన్లలోనే 16సార్లు కాల్పులు జరిపాడని, వాహనం లోంచి దిగిన 6 సెకన్లలోపే అతగాడు కాల్పులు ప్రారంభించాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ వీడియో గ్రాపిక్ మాత్రమేనని, కాని అది అత్యంత హింసాత్మక చర్య అని, తల్చుకుంటేనే అది వణికింప జేస్తోందని చికాగో ప్రభుత్వ అటార్నీ జనరల్ అనితా అల్వరాజ్ మీడియాకు చెప్పారు. సాక్ష్యాలను పరిశీలిస్తే పోలీసు అధికారి వాన్‌డైక్ నల్లజాతి కుర్రాడిని నగ్నంగా హత్య చేసినట్లు తెలుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. 17 సంవత్సరాల బాలుడిని అంత క్రూరంగా చంపడం చూస్తుంటే తీవ్రంగా కలిచివేస్తోందని చికాగో ప్రజల హృదయాలను ఈ వీడియో తప్పక కదిలించివేస్తుందని అనిత చెప్పారు.

 

కాగా, సంవత్సరం తర్వాత ఈ వీడియోను విడుదల చేయడానికి, చికాగో ప్రజలను అదుపు చేయలేమన్న ఆందోళనే  కారణమని తెలుస్తోంది. ఒక సమాజం మొత్తంగా తన భద్రతను పోలీసుల చేతికి అప్పగిస్తే ఏమవుతుందో అమరికాలో నల్లజాతి యువకులను విచ్చలవిడిగా కాల్చి చంపడం చూస్తే అర్థమవుతుంది. జాత్యహంకారం మూర్తీభవించిన శ్వేతజాతి పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నల్లజాతిని ఎలా టార్గెట్ చేస్తున్నారో కూడా ఈ వీడియో స్పష్టం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: