నల్గొండ జిల్లాలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండింటిలో ఒకటి తెరాసకు దక్కడం గ్యారంటీ. రెండో స్థానం మీద కాంగ్రెస్‌ పార్టీకి ఆశ ఉంది. పార్టీ మొత్తం సంగతి ఏమో గానీ.. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవశం చేసుకోవాలని.. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎంపీగా కూడా చేసిన ఆయన, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు. ధనబలం ఒక్కటే సాధారణ ఎన్నికల్లో గెలవడానికి సరిపోదని ఆయనకు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో బోధపడింది. సిటింగ్‌ ఎంపీగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. 


ఇప్పుడు ఎన్నికల్లో ఎమ్మెల్సీ కావాలని ఆయన ఉబలాటపడుతున్నారు. ప్రజలతో నేరుగా నిమిత్తం లేకుండా.. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాత్రమే జరిగే ఎన్నిక గనుక.. తన వ్యూహాలు, కానుకలు, ఆఫర్లు పనిచేస్తాయని విజయం దక్కుతుందని రాజగోపాల్‌ లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్సీగా పోటీచేయడం దాదాపు ఖరారు అయినట్లే. ఎప్పటినుంచో ఆయన ఈ మేరకు జిల్లాలోని తమ పార్టీ స్థానిక సంస్థల వారందరితోనూ టచ్‌లో ఉంటూ వారిని తనకు అనుకూలంగా మలచుకుని ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల రాష్ట్ర నాయకత్వానికి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. 


అయితే తన విజయం గురించి ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఇప్పుడు తెరాస పార్టీకి లేదా ఆ పార్టీకి చెందిన ప్రతినిధులకు కూడా బేరాలు ఆఫర్‌ చేస్తాడా లేదా అనేది కీలకమైన చర్చనీయాంశంగా మారుతోంది. యిక్కడ రెండు ప్రాబబిలిటీస్‌ నడుస్తున్నాయి. ఒకటి- డైరక్ట్‌ తెరాస పార్టీ నాయకత్వానికే కోమటిరెడ్డి బేరం పెట్టి.. నల్గొండలో వారు ఒక అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించేలా ఏర్పాటు చేసుకోవడం లేదా, రెండు- ఆ పార్టీకి చెందిన లోకల్‌ బాడీస్‌ ప్రతినిధులకు విడివిడిగా ఆఫర్లు పెట్టడం. నిజానికి ఆయనకు మొదటి మార్గమే సేఫ్‌ అని.. దానికి తెరాస నాయకత్వం కూడా ఒప్పుకోవచ్చునని.. కొందరు వాదిస్తున్నారు. ''రాజకీయ బేరసారాలకు అవకాశం లేకుండా ఉండేందుకు'' అనే నీతిని ప్రకటించడం ద్వారా.. తెరాస ఇక్కడ ఒకే అభ్యర్థిని పోటీకి దింపినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎమ్మెల్సీ అయితీరాల్సిందేనని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఏ వ్యూహాలను అనుసరిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: