రేణుకా చౌదరి.. పాపం పేరు ఈమె ఎంపీయే అయినా ఇటీవల వార్తల్లో ఎక్కడా కనిపించడం లేదు. కనిపించే అవకాశం కూడా రావడం లేదు. ఎప్పుడైనా కనిపించినా.. అది కాస్తా నెగిటివ్ వార్తల్లోనే కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని రేణుక మోసం చేశారని ఆమధ్య ఒకామె ఆత్మహత్యాయత్నం పేరుతో హడావిడి చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఎంపీ రేణుకా చౌదరి వార్తల్లోకి వచ్చారు. 

కాకపోతే ఈసారి కూడా ఆమె నెగిటివ్ వార్తతోనే లైమ్ లైట్ లోకి వచ్చారు. తాను రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సమయంలో  రేణుక చౌదరి ఖమ్మం జిల్లా పాల్వంచలోని సర్కారు భూములను పరిశ్రమలు ఏర్పాటు చేస్తానంటూ కేటాయింప జేసుకున్నారట. పరిశ్రమల పేరుతో తీసుకున్నా వాటి ఊసే ఎత్తకుండా ఎంచక్కా ఆ భూముల్లో మామిడి తోటలు వేసుకున్నారట. ఇన్నాళ్లు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ వ్యవహారం ఈనాటిదేం కాదు.. చాలా ఏళ్ల కిందటి విషయం. కానీ ఇప్పటికీ అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టలేదు. ఇప్పుడు ఈ భూములపై సీపీఎం నేతల కన్ను పడింది. భూపోరాటాల్లో ఆరితేరిన ఆ పార్టీ నాయకులు ఎంపీగారికి కేటాయించిన భూములను సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ భూములను నిరుపేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఎంపీగారి పేరుతో ఉన్న ఈ భూముల్లో ఎర్రజెండాలు పాతారు ఎర్ర పార్టీల నాయకులు. చివరకు వ్యవహారం సబ్ కలెక్టర్ వరకూ వెళ్లింది. ఆయన యథాప్రకారం సర్వే చేసి ఎవరైనా కబ్జా చేసి ఉంటే నోటీసులు ఇమ్మని అన్నారట. అయితే.. రేణుక పరిశ్రమ కోసం భూములు తీసుకున్న విషయం వాస్తవమా కాదా.. ఆమె నిబంధనలు ఉల్లంఘించిన మాట నిజమా కాదా అన్న విషయం మాత్రం తేల్చడం లేదు. అటు ఎంపీ రేణుక కూడా ఈ విషయం ఇంకా స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: