స్త్రీ పురుష సమానత్వం అన్న భావనే ఇస్లాం మతానికి విరుద్ధమని కేరళలోని ఒక ముస్లిం మత గురువు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఆయన అంతటితో ఆగారా అంటే లేదు. ఆడవారు పిల్లల్ని కనడానికే పనికొస్తారు తప్పితే మగాళ్లతో వారెన్నటికీ సమానులు కాలేరని వాగేశారు. ఆయన పూర్తి మాటలు వింటే ఈ ఆధునిక కాలంలోనూ ఇంత మూర్ఖమైన అభిప్రాయాలు ప్రపంచంలో ఉంటున్నాయా అని ఆశ్చర్యం కలగక తప్పదు. 


తిరువనంతపురం లోని సున్నీ మత గురువు అబూబకర్ ముసిలియర్ స్త్రీ పురుష సమానత్వం గురించి, స్త్రీ శక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ప్రపంచాన్ని నియంత్రించేంత మానసిక బలం కానీ శక్తి కానీ ఆడవాళ్లకు లేనే లేవనేశారు. ఆ శక్తి పురుషులకే ఉందని తీర్పు కూడా ఇచ్చేశారు. స్త్రీ పురుష సమానత్వం అనేది ఎన్నటికీ వాస్తవం కాని విషయమని ఆ ఉలేమా తోసిపుచ్చారు. ఆడ-మగ సమానం అనే భావన ఇస్లామ్‌కు, మానవజాతికే వ్యతిరేకమైనదనేశారాయన.. పైగా అది మేధోపరంగా తప్పట. కోజికోడ్‌లో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్‌ నిర్వహించిన ఒక క్యాంపులో మాట్లాడుతూ ఆయన ఈ అమూల్యమైన అభిప్రాయాలను శ్రోతలతో పంచుకున్నారు. 


ఆడవాళ్లు మగాళ్లతో ఎన్నటికీ సమానులు కాలేరు. వారు పిల్లలను కనడానికే పనికొస్తారంతే. సంక్షోభ సమయాల్లో వారు నిలబడలేరు అంటూ వాగిన ఆ మతపెద్ద తన వాదనను సమర్థించుకునేందుకు మరో వింతైన విషయం చెప్పారు. ప్రపంచంలోని ఇన్ని వేలమంది గుండె వ్యాధి నిపుణులలో ఒక్కరంటే ఒక్క మహిళా వైద్యురాలు ఉన్నారా చెప్పండి చూద్దాం అని సవాలు విసిరారు కూడా. ఇంతకూ కార్డియాక్ సర్జన్లలో మహిళల సంఖ్య తక్కువ కావడానికి ఆడ-మగ సమానత్వానికి మధ్య ఉన్న బాదరాయణ సంబంధమేమిటని ఆ విద్యార్థులలో ఒక్కరు అడిగిన పాపాన పోలేదు. 


ఇంతకూ ఆ మతపెద్ద వయస్సు ఎంతో కాదు జస్ట్ 76 సంవత్సరాలు మాత్రమే. నడవడానికి కూడా శక్తిలేని ముదివయస్సులోని ఈ ముస్లిం గురువు సంక్షోభ సమయాల్లో మహిళలు నిబ్బరంగా ఉండలేరు అంటూ నిర్భయంగా ప్రకటించడమే మహాశ్చర్యం వేస్తోంది. ఆర్థిక బాథలు తట్టుకోలేక చెట్టంత మగాళ్లు నిలువునా జీవితాన్ని చాలించుకుంటూంటే మొత్తం సంసారాన్ని ఒంటిచేత్తో ఈదుతూ పిల్లల్ని పెంచుతున్న మహిళలను భారత దేశమంతటా వ్యవసాయ కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం. సంక్షోభం ఎదురైనప్పుడు మాడి మసవుతున్నది పురుషులా లేక మహిళళా అని ఆయనకు ఎవరూ బదులిచ్చినట్లు లేదు.


ఈ వయసుడిగిన మత గురువుకు ఇలాంటి ప్రకటనలు కొత్త కాదుమరి. ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవలే మాట్లాడి తీవ్ర విమర్శలు రావడంతో తన ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మహిళలకు ఎన్నికల్లో చాలా ఎక్కువగా సీట్లు ఇచ్చేత్తన్నారంటూ వాపోయిన ఈ పెద్దమనిషి కో-ఎడ్యుకేషన్ గురించి కూడా అవాకులూ చవాకులూ పేలాడు. ఇస్లాంను దాని సంస్కృతిని సర్వనాశనం చేయడానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్రలో భాగమే సహవిద్య అని ఢంకా భజాయించేశాడు. ఇలాంటి ఉలేమాలు.. భోగస్ మత గురువులు ప్రతి మతంలోనూ ఊరికి ఒకరు ఉంటే చాలు.. అన్ని మతాల్లోనూ ఐసిస్ తరహా ఉగ్రవాదులు పుట్టుకురావడానికి క్షణ కాలం పట్టదు మరి. మనకూ ఉన్నారుగా ఆశారాం బాపూలాంటి వాళ్లు... 


మరింత సమాచారం తెలుసుకోండి: