అనిల్ కుమార్ సింగ్ అనే పెద్దాయన చాలా కాలం క్రితమే ఓ ఇంటివాడయ్యారు. కానీ 44 ఏళ్ల క్రితం తాను సాధించిన బంగారు పతకాన్ని మాత్రం 65 ఏళ్ల ముది వయస్సులో చేజిక్కించుకోగలిగారు. లక్నో యూనివర్సిటీలో 1971లో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్ సాధించిన అనిల్ ఇన్నాళ్ల తర్వాత ఆ బంగారు పతకాన్ని సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్వీకరించగలిగారు. సబ్జెక్టులో అత్యథిక మార్కులు సాధించి బంగారు పతకానికి అర్హుడైన ఈయనకు విశ్వవిద్యాలయం చేసిన నిర్వాకం ఫలితంగా ఇన్నాళ్లుగా ఆ పతకాన్ని పొందలేకపోవడం విచారకరం అవునో కాదో కానీ మన దేశానికి దౌర్భాగ్యం అని మాత్రం చెప్పి తీరాలి. 


ఆ బంగారు పతకం తనకు ఎందుకు ఇన్నాళ్లుగా అందలేదో తెలుసుకుంటే ఎంత అల్పాతి అల్ప విషయాలు మన విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించుకుని తిష్ట వేశాయో అర్థమవుతుంది. 1971 సంవత్సరంలో లక్నో యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక నిర్వహించే కాన్వొకేషన్ సమావేశం నిర్వహించలేదట. దాంతో ఆ సంవత్సరం పతకాలు సాధించిన ఏ ఒక్కరికీ వాటిని అందచేయలేదు. 44 ఏళ్లపాటు చేసిన భగీరథ ప్రయత్నం తర్వాత అనిల్ కుమార్ సింగ్ కనీవినీ ఎరుగని రీతిలో తన బంగారు పతకం తెచ్చుకోవడంతో ఆనాటు పతకాలకు అర్హత పొందీ వాటిని తీసుకోలేకపోయిన తోటి విద్యార్థులు ఇప్పుడు కొండంత ఆశతో ఆ విశ్వవిద్యాలయ తలుపులు తట్టడానికి సిద్ధమవుతున్నారు.


బాధాకరమైన విషయం ఏమిటంటే... అనిల్ తన విద్యను పూర్తి చేశారు. రసాయన శాస్త్ర విభాగంలో టీచరుగా పని చేశారు. 2012లో రిటైరయ్యారు కూడా. పైగా రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్‌కు ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా. ఏ సంవత్సరంలోనయినా కాన్వొకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతే, డిగ్రీలను, పతకాలను ఇవ్వకూడదని యూనివర్శిటీలో ఒక బండ చట్టం ఉందట. అందుకే ఇన్నాళ్లుగా లక్నో యూనివర్సిటీ అధికారులను సతాయిస్తున్నప్పటికీ ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వారు తనకు పతకాన్ని దూరం చేశారని అనిల్ వాపోయారు. అయితే ఏ కారణం వల్లనైనా ఒక సంవత్సరం కాన్వొకేషన్ జరగకపోతే పతకాలు సాధించిన వారికి రిజిస్టర్ పోస్టులో వాటిని పంపాలని మరో సెక్షన్ కూడా అదే చట్టంలో ఉంది కానీ దాన్ని పట్టించుకున్న నాథుడు ఇన్నాళ్లుగా లేరు. 


చివరకు ఆర్టీఐ చట్టం ద్వారా తనకు బంగారు పతకం పొందే అర్హత ఉందో లేదో చెప్పవలసిందిగా అనిల్ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులుకు తాఖీదు పంపితే కానీ వారు స్పందించలేదు. చివరకు వైస్ చాన్సలర్ ఆమోదంతో శనివారం ఆయన తన బంగారు పతకాన్ని ఎట్టకేలకు సాధించుకుని ముద్దాడారు. ఆయన కుమార్తె ఐశ్వర్యా సింగ్ ప్రస్తుతం సిక్కింలో ఐఏఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు.  2004లో ఈమె సైతం అదే లక్నో విశ్వవిద్యాలయంతో సుదీర్ఘ పోరాటం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చాన్సలర్ గోల్డ్ మెడల్ పొందే అర్హత తనకు ఉన్నప్పటికీ వర్సిటీ తనకు దాన్ని అందివ్వలేదని ఆమె చేసిన పోరాటం విశ్వవిద్యాలయ చట్టాన్నే మార్చివేసింది. మొత్తంమీద ఒక కుటుంబంలోని రెండు తరాలు ఒకే యూనివర్సిటీ మందకొడితనం బారిన పడి నలిగిపోయాయన్నమాట


మరింత సమాచారం తెలుసుకోండి: