కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈనాడు పత్రిక చాలావరకూ సర్కారు అనుకూలంగానే వెళ్తోంది. ఎప్పుడో ఒకటీ అరా తప్ప నెగిటివ్ వార్తలు కనిపించడం లేదు. కేసీఆర్, ఫిలింసిటీకి వచ్చి మంతనాలు జరిపిన తర్వాత సీన్ మరీ మారిపోయింది. ఈనాడు పరిస్థితి ఇంత మారిన కేసీఆర్ సొంత పత్రిక మాత్రం ఈనాడుపై మండిపడుతూనే ఉంది. లేటెస్టుగా రాజధానిలో దాహార్తి అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై విమర్శలతో చెలరేగిపోయింది.  

ఆంధ్రజ్యోతి దుర్యోధనుడేతే... ఈనాడు ధృతరాష్ర్టుడి తరహా అంటూ ఘాటు వ్యాఖ్యలతో నమస్తే తెలంగణ విరుచుకుపడింది. ఆంధ్రజ్యోతి మనకు శత్రువు అని తెలిసిపోతుందని.. కానీ ఈనాడు మనకు శత్రువు అని గుర్తించేలోపే మనం దెబ్బ తిని ఉంటామని సెటైర్ వేసింది. ఈనాడు తెలంగాణ జనం కోసం బాధపడుతున్నట్టే కనిపిస్తుందని.. తెలంగాణపై ఎంతో ప్రేమ ఉన్నట్టే నటిస్తుందని.. అందంతా తెలంగాణను వైఫల్యంగా చూపించే కుట్రలో భాగంగా జరుగుతుందని న. తెలంగాణ వ్యాఖ్యానించింది. 

అసలు హైదరాబాద్ లో నీటి సమస్య ఇంతగా విజృంభించడానికి 60 ఏళ్ల ఆంధ్రాపాలకుల నిర్లక్ష్యమేనంటూ పేర్కొన్న నమస్తే తెలంగాణ.. ఆ కారణాన్ని సీమాంధ్ర మీడియా రాయడం లేదని విమర్శించింది. తాజాగా వచ్చిన నీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రాజెక్టులను పూర్తి చేసుకొస్తున్న కోణాన్ని మాత్రం ఈనాడు చెప్పడం లేదని కామెంట్ చేసింది. 

సీమాంధ్ర పాలకులు రాక ముందు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నీటి తటాకాలే ఉండేవట. ఏడాదిలో ఆరు నెలలు వర్షాలు కురిసేవట. సీమాంధ్ర పాలకుల నిర్వాకాల ఫలితంగానే ఇప్పుడు చలికాలం, వర్షాకాలం అనేతేడా లేకుండా ఎండలతో మాడిపోతున్నామట. సీమాంధ్ర మీడియా, ఇంతకాలం వారి ప్రాపకంలో కిరీటాలు ధరించి ఊరేగిన టీడీపీ, కాంగ్రెస్‌ హైదరాబాద్‌కు సమస్యలన్నీ ఇప్పుడే వచ్చిపడినట్టు జనాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ పత్రిక మండిపడింది. 

ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈనాడు కథనం కూడా ఓ భాగమేనని నమస్తే తెలంగాణ తేల్చి పారేసింది. మరి అందులో నిజానిజాలేంటో పాఠకులే నిర్థారించుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: