ఎన్నికల సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు వెరీ కామన్.. కానీ ఫలితాలు  వచ్చాక వాటిలో అమలయ్యే వాటిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఈ ఎన్నికల్లో కూడా కొందరు నాయకులు సవాళ్లు విసురుకున్నారు. ప్రత్యేకించి సీపీఐ నారాయణ టీఆర్ఎస్ కు విసిరిన సవాల్ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ సొంత బలంతో మేయర్ పీఠం దక్కించుకుంటే తాను చెవి కోసుకుంటానని నారాయణ కామెంట్ చేశారు. 

సీపీఐ నారాయణ కామెంట్ పై టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే స్పందించారు. ఆ సీపీఐ నారాయణ ఫలితాలు వెలువడే ఐదో తారీఖును హైదరాబాద్ లో ఉండటం మంచిది కాదని ముందుస్తుగానే సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో ఉంటే ఆయన చెవి ఎవరైనా కోయవచ్చని.. మళ్లీ తాను ఆయన్ను కోఠీ ఈఎన్ టీ ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుందని కేసీఆర్ కామెంట్ చేశారు. 

ఇప్పుడు నిజంగానే సొంత బలంతో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంది. అందులోనూ 75 సీట్లే కాదు.. దాదాపు సెంచరీ స్కోరుకు చేరువై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. ముందుగా చెప్పినట్టుగా సీపీఐ నారాయణ చెవి కోసుకుంటారా..లేక టీఆర్ఎస్ వాళ్లు ఆయన చెవి కోస్తారా.. ఈ సందేహాలకు సాక్షాత్తూ కేసీఆరే తెరదించారు. 

సీపీఐ నారాయణ గారు ఎన్నికల ముందు ఓ శపథం చేశారు. కానీ ఒక్క చెవి నారాయణను చూడటం నా కిష్టం లేదు.. అందుకే దయచేసి టీఆర్ఎస్ కార్యకర్తలెవరూ నారాయణను ఏమీ అనకండని కేసీఆర్ కార్యకర్తలకు సలహా ఇచ్చారు. నారాయణ గారిని కాపాడకుందాం.. వారి జోలికి ఎవరూ పోవద్దు.. అంటూ కేసీఆర్ పిలుపు ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: