గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనివినీ ఎరుగుని రీతిలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ ఏ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో సాధించని రీతిలో అపురూపమైన విజయం సాధించింది. గత గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వెనుకాడిన పార్టీ ఇప్పుడు ఏకంగా వంద సీట్లు గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కేసీఆర్ ను ఆనందడోలకల్లో ముంచెత్తాయి. 

ఫలితాలు పూర్తిగా వెలువడీ వెలువడకుండానే ఆయన విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించారు. అపూరూప విజయాన్నందించిన హైదరాబాదీలకు రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ వాసులపై మరోసారి వరాల వర్షం కురిపించారు. ప్రత్యేకించి గూడు లేని నిరుపేదలపై ఆయన మరోసారి ప్రేమ కురిపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్లోగన్ కు బాగా పాపులారిటీ వచ్చింది. 

అందుకే.. హైదరాబాద్ పరిథిలో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని ప్రెస్ మీట్లో ప్రామిస్ చేశారు. అవి కూడా ఏడాదిలో నిర్మాణాలు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ప్రజలను బాగా ఆకర్షించిన నినాదాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒకటి. ఈ హామీకి ప్రజల్లో మంచి స్పందన ఉందని కేసీఆర్ నిర్వహించిన సర్వేల్లో తేలిందట. 

ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాదే కాకుండా.. వరుసగా 2,3 సంవత్సరాలు ఇలా ఏడాదికో లక్ష ఇళ్లు కట్టుకుంటూ పోతామని.. హైదరాబాద్ లో సొంతిల్లు లేని వారు ఉండకూడదనేదే తమ ఉద్దేశమని కేసీఆర్ తెలిపారు. ఆయన ఇప్పటికే ఐడీహెచ్ కాలనీని సకాలంలో కట్టి చూపించారు. మరి ఈ మాట కూడా నిలబెట్టుకుంటే గ్రేటే.



మరింత సమాచారం తెలుసుకోండి: