సంచలనాలకు మారుపేరైన టీవీ 9 న్యూస్ ఛానల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల ప్రసారంలో తప్పులో కాలేసింది. ఏ పార్టీ ఎన్ని డివిజన్లు గెలిచిందనే వివరాలు తెలిపే పట్టికలో నెంబర్లను పలుసార్లు తప్పుగా చూపించింది. సాధారణంగా ఎన్నికల ఫలితాల సమయంలో అన్ని ఛానెళ్లు అత్యుత్సాహం చూపుతుంటాయి.

 ఏవో కొన్ని ఈటీవీలాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలని మడికట్టుకున్న ఛానళ్లు తప్పితే మిగిలినవన్నీ ఇష్టానుసారం ఫిగర్లు ప్రసారం చేస్తాయి. అసలు ఫలితాలు వెలువడకుండానే ట్రెండ్ ను బట్టి కొంత ఎగ్జాగరేట్ చేసి చూపిస్తాయి. ఫలితాలు అప్పుడప్పుడే వెలువడుతున్న సమయంలో ఛానళ్లకు ఈ వెసులు బాటు ఉంటుంది. గెలుపు ప్లస్ ఆధిక్యం అని చూపుతాయి కాబట్టి కొంత అటూ ఇటూగా ఫిగర్ వేసినా తప్పుకాదన్నది ఈ ఛానళ్ల పాలసీ. 

కానీ శుక్రవారం గ్రేటర్ ఫలితాల విషయంలో మాత్రం టీవీ 9 తప్పులో కాలేసింది. మరి అత్యుత్సాహమో.. ఆ ఏమవుతుందిలే అన్న దీమానో తెలియదు కానీ.. ఫలితాల సరళిని బట్టి టీఆర్ఎస్ 110 వరకూ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చూపించింది. మొదట్లోనే కాదు.. దాదాపు అన్ని ఫలితాలు వెలువడిన సమయంలోనూ టీఆర్ఎస్ కు వందకు పైగానే స్థానాలు చూపించింది. 

మరో విచిత్రం ఏంటంటే.. టీఆర్ఎస్ సొంత ఛానెల్ అయిన టీ న్యూస్ కూడా టీఆర్ఎస్ కు 99 స్థానాలే అని ప్రసారం చేస్తున్న సమయంలో కూడా టీవీ9 100కు పైగా స్థానాలు చూపించడం విశేషం. ఫలితాల కోసం అన్ని ఛానళ్ల పట్టికలు చూస్తున్న ఔత్సాహికులు ఈ టీవీ 9 తీరు చూసి ఆశ్చర్యపోయారు. తుది ఫలితాలు అందుబాటులో ఉన్న సమయంలో కూడా పట్టిక మార్చుకోకపోవడం చూసి అవాక్కయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: