విశ్వనటుడు కమల్ హాసన్ సోమవారం నాడు అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల వాక్ స్వాతంత్ర్యం అన్న అంశంపై ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ వార్షిక సదసులో ఆయన మాట్లాడుతూ నిరంతర నిఘా ద్వారా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాదు ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ చురకలంటించారు.

తాను  భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని విమర్శించట్లేదని, మన దేశం ప్రపంచానికే ఉదాహరణగా నిలవాలన్నదే తన అభిమతమని కమల్ హాసన్ వెల్లడించారు. రాజకీయాల్లోకి మతాలు రావడం దేశ ఆరోగ్యానికి అంత మంచిది కాదని, నెహ్రూ చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వమే బలమని చెప్పారు. జర్మనీలో హిట్లర్ పురోగతి, భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన సంఘటనలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, వాటిని వ్యతిరేకించిన స్వరాలను అణగదొక్కారని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యం అంటేనే వాక్ స్వాతంత్యం కాదని, దానిపై ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని కమల్‌హాసన్ అన్నారు.రాజకీయాల్లో మత ప్రస్తావన సరైంది కాదన్నారు. స్వప్రయోజనాల కోసం వత్తిడి తెచ్చే ప్రభుత్వమైనా, మతమైనా ఉపేక్షించవద్దు అని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సెన్సార్ బోర్డులో తాజాగా సభ్యుడిగా మారిన కమల్‌హాసన్ ఆ బోర్డు ప్రక్షాళనపై దృష్టిపెట్టారు.ప్రపంచానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్న వేళ, అంతేమొత్తంలో అవకాశాలూ అందివస్తున్నాయని, ప్రపంచ స్థాయి నాణ్యతను భారత్ అందిపుచ్చుకోవాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: